చంద్రబాబుకు నిద్ర లేకుండా చేయాలని ఆదేశాలు.. జైలు సిబ్బంది ఇలా , జగన్ సైకో ఆనందం: దేవినేని ఉమా
జైల్లో చంద్రబాబు సరిగా నిద్రపోకుండా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు . సిబ్బంది విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడం వంటివి చేస్తున్నారని ఉమా వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. జైల్లో చంద్రబాబు సరిగా నిద్రపోకుండా చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిద్రకు భంగం కలిగించాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు ఆదేశాలు వెళ్లాలని దేవినేని ఆరోపించారు. దీంతో సిబ్బంది విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడం వంటివి చేస్తున్నారని ఉమా వ్యాఖ్యానించారు. నిద్రలేమితో బాధపడుతున్న చంద్రబాబును సీసీ కెమెరాలలో చూసి జగన్ సైకో ఆనందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. శుక్ర, శని, ఆదివారాల్లో జగన్ నిద్రపోకుండా .. ఎవరిని అరెస్ట్ చేద్దాం అని ఆలోచిస్తూ వుంటారని దేవినేని ఉమా ఆరోపించారు.
అంతకుముందు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నోరు విప్పితే అబద్దాలు తప్పితే వాస్తవాలు మాట్లాడటం లేదన్నారు. అవినీతి మరక లేని మహానాయకుడిని అక్రమకేసుతో జైళ్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సంబంధించి స్కిల్ కేసులో ఒక్క ఆధారం అయినా చూపించగలరా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. పొత్తుల ప్రకటన తర్వాత సీఎంకు, మంత్రులకు భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
ALso Read: అవినీతి మరక లేని మహానాయకుడిని అక్రమకేసుతో జైళ్లో పెట్టారు...అచ్చెన్నాయుడు
స్కిల్ కేసులో సీఎంతో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. పవన్ పొత్తుల ప్రకటన తర్వాత వైసీపీ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. చాలా మంది పోటీచేయడానికి కూడా వెనకాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబుతో పవన్ భేటీ తర్వాత ఏం జరిగిందో వాస్తవాలన్నీ చెప్పారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. పొత్తుల ప్రకటన సీక్రెట్ గా ఏమీ చేయలేదు కదా అని ఆయన ప్రశ్నించారు.