Andhra Pradesh: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా స‌ర్కారుకు ప్ర‌జ‌లు బుద్దిచెప్పే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయ‌కుడు దేవినేని ఉమ అన్నారు. ఆర్టీసీ బ‌స్సు టిక్కెట్టు ధ‌ర‌లు, విద్యుత్ చార్జీల పెంపుపై ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు.  

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయ‌కుడు దేవినేని ఉమ.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా స‌ర్కారుపై తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆర్టీసీ బ‌స్సు టిక్కెట్టు ధ‌ర‌లు, విద్యుత్ చార్జీలు పెంచిన ప్రభుత్వానికి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు బుద్దిచెబుతారంటూ మండిప‌డ్డారు. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యుత్ చార్జీల‌ను పెంచింది. తాజాగా ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను కూడా పెంచింది. ఇంధ‌న ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు సైతం ఆకాశాన్ని తాకుతున్న త‌రుణంలో విద్యుత్‌, బ‌స్సు చార్జీల పెంపు ప్ర‌జ‌ల‌పై మ‌రింత భారాన్ని మోపింది. దీంతో చార్జీల పెంపున‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష టీడీపీ ఆందోళ‌న‌కు దిగింది. 

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కుడు దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అమ‌రావ‌తిలోని గొల్ల‌పూడి నుంచి మైల‌వ‌రం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సులో ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా బ‌స్సులోని ప్ర‌జ‌లతో మాట్లాడి వారి క‌ష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. జ‌గ‌న్ పాల‌న‌పై బ‌స్సులోని ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మ‌హిళ‌ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉగాది పండుగ వేళ విద్యుత్ ఛార్జీలను పెంచిన స‌ర్కారు.. గుడ్ ఫ్రైడేకి ఆర్టీసీ టికెట్ ధ‌ర‌లు పెంచిందంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ప్ర‌జావ్య‌తిరేక పాల‌న కొన‌సాగుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. వైకాపా స‌ర్కారు పండ‌గ‌ల‌పూట చార్జీలు పెంచుతూ.. ప్ర‌జ‌ల‌పై భారాలు మోప‌డం దారుణ‌మ‌ని అన్నారు. ఈ మోస‌పూరిత స‌ర్కారుకు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉందని ఆయ‌న అన్నారు.

ప్రస్తుతం ఈ తుగ్లక్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ పాల‌న‌లో పండుగలకు ప్ర‌జ‌ల‌కు కానుకలు ఇస్తే... వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ప్ర‌జ‌ల‌పై భారాలు మోపుతున్నార‌ని విమ‌ర్శించారు. నేడు గుడ్‌ ఫ్రైడే రోజున ఆర్టీసీ చార్జీలు, గతంలో ఉగాది రోజున విద్యుత్‌ చార్జీలు పెంచారంటూ సెటైర్లు వేశారు. పెంచిన చార్జీలు త‌గ్గించే వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ పోరాటం కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేస్తామ‌ని పేర్కొన్నారు. కాగా, ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల‌న్ని భగ్గుమంటున్నాయి. ఆర్టీసీ చార్జీల‌ను పెంచ‌డంపై టీడీపీతో పాటు సీపీఐ, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. వైకాపా స‌ర్కారు రాష్ట్ర ప్రజల్ని పీక్కుతింటున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. వారానికో చార్జీలు పెంచడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.

Scroll to load tweet…