తిరుపతి డిక్లరేషన్ విషయంలో వైసీపీ నేతల వ్యాఖ్యలను సీబీఐ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా ముందుకు వచ్చిన ఆయన భవిష్యత్‌లో ఏ నాయకుడు కూడా భక్తుల విశ్వాసాలతో ఆటలాడకుండా గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం వుందని ఉమా అన్నారు.

తిరుపతి పర్యటనలో భాగంగా సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టి కోట్లాది మంది భక్తులకు తనకు స్వామి వారి పట్ల విశ్వాసం వుందని తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:టెన్షన్ వాతావరణం: తిరుమలకు చేరుకొన్న మంత్రి కొడాలి నాని

వందల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్న ఈ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై వుందని దేవినేని ఉమా చెప్పారు. కాగా , బుధవారం నాడు మధ్యాహ్నం మంత్రి నాని నేరుగా తిరుమలకు చేరుకొన్నారు. అధికారులకు  సమాచారం ఇవ్వకుండానే తిరుమలకు చేరుకోవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. 

తిరుమల డిక్లరేషన్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతకం చేయాల్సిన అవసరం లేదని కొడాలి నాని ప్రకటించారు. తిరుమలలో డిక్లరేషన్ ను ఎత్తివేయాలని కూడ డిమాండ్ చేశారు. దేవాలయాల్లో చోటు చేసుకొన్న ఘటనలపై మంత్రి నాని చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని  సీఎం వైఎస్ జగన్ వెంకటేశ్వరస్వామికి ఇవాళ సాయంత్రం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సీఎం జగన్ తిరుమల పర్యటనను పురస్కరించుకొని టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.