అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి. వైయస్ జగన్ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. వైయస్ జగన్ హత్యారాజకీయాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్యారాజకీయాలతో అనంతపురం జిల్లాలో ఎంతోమంది టీడీపీ నాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్నారని ఆరోపించారు. జగన్ హత్యా రాజకీయాలకు తాము భయపడేది లేదని హెచ్చరించారు.  

రాష్ట్ర విభజన అనంతరం రాజధానిలేకపోవడంతో బస్సులో ఉండి పాలన చేస్తూ అభివృద్ధి చేసిన కష్టజీవి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.  

వైయస్ఆఱ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 40రోజులు కావస్తున్నా నేటికి పాలనపై దృష్టిసారించలేదని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమంలో పారదర్శకతలేకపోతే ప్రజల పక్షాన నిలిచి పోరాడతామని పార్థసారథి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

రాష్ట్రంలో కొంతమంది అధికారులను వైసీపీ నేతలు భయపెడుతున్నారని తమకు సమాచారం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని శాఖల అధికారులు ఈ పాలనలో భయభ్రాంతులకు గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని తెలిపారు.  

నాయకులకు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఐక్యంగా పోరాడతామని తెలిపారు. బతికినంతకాలం తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని పార్టీని వీడేది లేదన్నారు.