ఏపీఎస్ ఆర్టీసి రూ.6వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందని స్వయంగా ఆ సంస్థ ఎండీ ఠాకూర్ ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ విజయసాయికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు.
విశాఖపట్నం: ఇటీవల ఏపిఎస్ ఆర్టీసి లాభాల్లోకి వచ్చిందంటూ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికన ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీఎస్ ఆర్టీసి ఎండీ ఠాకూర్ ఆర్టీసి రూ.6వేల కోట్ల నష్టాల్లో వుందని ప్రకటించిన నేపథ్యంలో విజయసాయికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు.
''ఎంపీ విజయసాయి రెడ్డి ఎప్పటిలాగే సీఎం జగన్ దూరదృష్టి వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేసింది అంటూ తనకి అలవాటైన తప్పుడు లెక్కలు రాసారు. కానీ జగన్ రెడ్డి దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఆర్టీసీ రూ.6వేల కోట్ల ఆప్పుల్లో కూరుకుపోయిందని...అంతే కాకుండా జగన్ రెడ్డి రాష్ట్ర వాటాగా ఇబ్బడిముబ్బడిగా డీజిల్ పై పెంచిన పన్నుల భారం ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసిందని నిజాల్ని బయటపెట్టారు ఆర్టీసీ ఎండీ ఠాకూర్'' అంటూ విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు అయ్యన్నపాత్రుడు.
''సీఎంగారి దూరదృష్టి వల్ల ఏపిఎస్ ఆర్టీసి గాడిన పడింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత లాభాల్లోకొచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆర్టీసీని తన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నించాడు. జగన్ గారు ప్రభుత్వంలో విలీనం చేసి - మాట నిలబెట్టుకున్నారు. ఒక్క ప్రభుత్వ సంస్థనైనా ఇలా నిలబెట్టావా చంద్రబాబూ?'' అంటూ విజయసాయి చేసిన ఈ ట్వీట్ కే అయ్యన్న కౌంటరిచ్చారు.
