చంద్రబాబుకు షాక్: కాపు నేతలు డుమ్మా, బెజవాడ నేతలు బొండా ఉమా వంశీ సైతం...
అలాగే అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ వంటి నేతలు కూడా గైర్హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొంది. వీరంతా ఇటీవలే కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశమైన నేతలు ఎవరూ కూడా చంద్రబాబు సమావేశానికి రాకపోవడంపై చర్చ జరుగుతోంది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశానికి కీలక నేతలు గైర్హాజరయ్యారు. యూరప్ ట్రిప్ అనంతరం అమరావతి వచ్చిన చంద్రబాబు నాయుడు బుధవారం 11 గంటలకు తన నివాసంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
చంద్రబాబు నాయుడు సమావేశానికి కీలక నేతలు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడలోనే ఉన్నప్పటికీ ఆయన చంద్రబాబు సమావేశానికి వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ వంటి నేతలు కూడా గైర్హాజరుకావడంపై ఉత్కంఠ నెలకొంది. జ్యోతుల నెహ్రూతోపాటు మీసాల గీత, బూరగడ్డ వేదవ్యాస్, కేఏ నాయుడు గైర్హాజరయ్యారు.
వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ లో ఉండగా కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో కాపు సామాజిక వర్గం నేతలకు టీడీపీ అధిష్టానం సహకరించలేదని వారంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ప్రచారం జరిగింది.
అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పోటీ చేసిన చోట్ల ఆర్థిక వనరులు చూపించడంలో వివక్ష చూపారని కాపు సామాజిక వర్గం నేతల సమావేశంలో నేతలు చర్చించారు. అలాగే పార్టీలో మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పెత్తనంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం చంద్రబాబు యూరప్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత కలుస్తామని కూడా ప్రకటించారు.
ఇకపోతే కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గం నేతల సమావేశానికి కీలక పాత్ర పోషించిన తోట త్రిమూర్తులు సమావేశానికి హాజరుకాకపోగా చంద్రబాబు వ్యవహారశైలిపైనా బుద్దా వెంకన్న శైలిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు భజనలు ఆపాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గం నేతల సమావేశానికి మాజీమంత్రులు గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్పలను ఆహ్వానించలేదు. వారు మాత్రమే చంద్రబాబు నాయుడు సమావేశానికి హాజరయ్యారు.
ఇదిలా ఉంటే తమకు సమాచారం లేదని అందువల్లే సమావేశానికి హాజరుకాలేదని టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ స్పష్టం చేస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అని తెలిసిందని అందువల్లే తాను వెళ్లలేదన్నారు. పార్టీ సమావేశం అయితే కచ్చితంగా మెసేజ్ వచ్చేదన్నారు.
మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కూడా చంద్రబాబు నాయుడు సమావేశానికి గైర్హాజరుకావడంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వల్లభనేని వంశీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ సమావేశాలకు గానీ కార్యక్రమాలకు గానీ హాజరుకావడం లేదని తెలుస్తోంది.
వల్లభనేని వంశీమోహన్ బీజేపీలో చేరే ఎమ్మెల్యేల జాబితాలో ఆయన కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు బీజేపీలో చేరే వారి జాబితాలో వల్లభనేని వంశీమోహన్ పేరు ప్రముఖంగా వినిపించింది.
మెుత్తానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అంతా చంద్రబాబు నాయుడు సమావేశానికి డుమ్మా కొట్టడంపై సర్వత్రా చర్చ జరగుతోంది. వీరంతా త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది.