నేడు జనసేన-టిడిపి జేఏసి సమావేశం... ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఛాన్స్
ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి-జనసేన కలిసి వైసిపి ప్రభుత్వంలో పోరాటానికి సిద్దమయ్యాయి. ఈ పోరాటం ఎలా చేయాలన్నదానిపై ఇవాళ జరిగే జేఏసి సమావేశంలో చర్చించనున్నారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే టిడిపి - జనసేన పొత్తు ఖరారయ్యింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసే పోటీచేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిడిపి-జనసేన కలిసి ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై చర్చలు సాగుతున్నారు. ఇరుపార్టీల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాల్లో దీనిపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో ఈ జేఏసి మొదటి సమావేశం జరగ్గా నేడు(గురువారం) రెండోసారి విజయవాడలో సమావేశం కానున్నారు.
టిడిపి-జనసేన క్షేత్రస్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి... ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో ఎలా వుండాలనేదానికి జేఏసీ సమావేశంలో చర్చించనున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సమావేశం జరగనుంది. రెండు పార్టీలకు చెందిన 12 మంది జేఏసి సభ్యులతో పాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సమవేశంలో పాల్గొననున్నారు. మొదటి జేఏసి సమావేశంలో పాల్గొన్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకావడంలేదు.
ఈ జేఏసి సమావేశంలో ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు మరింత చేరువయ్యేలా మేనిఫెస్టో రూపకల్పన చేసేందుకు కసరత్తు సాగనుంది. ఇరుపార్టీల నాయకులు కూలంకశంగా చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోనున్నారు...జేఏసి సమావేశం అనంతరం ఈ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించే అవకాశాలున్నాయి.
Read More పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటీ...
ఇక ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి. దీనిపైనా జేఏసిలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో కరువు, రైతుల సమస్యలు, విద్యుత్ చార్జీల పెంపుపై నియోజకవర్గస్థాయిలో ఎలా పోరాడాలనే దానిపై చర్చించనున్నారు. ఇరు పార్టీలు కలిసి వైసిపి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తెలియజేయాలో అన్నదానిపై చర్చించనున్నారు. ప్రజలతో కలిసి ఎలా పోరాటాలు చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
నిరుద్యోగ సమస్య, రోడ్ల దుస్థితి, పేదల గృహ నిర్మాణంలో అవకతవకలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంపు,ఇసుక దోపిడీపైనా పోరాటానికి టిడిపి - జనసేన కూటమి సిద్దమయ్యింది. వీటిపై కూడా నియోజకవర్గ స్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై జేఏసి సమావేశంలో చర్చించనున్నారు.