ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో విజయవాడలో రాజకీయాలు వేడెక్కాయి . బెజవాడ వెస్ట్‌ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత జలీల్ ఖాన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో విజయవాడలో రాజకీయాలు వేడెక్కాయి. టికెట్లు దక్కని నేతలు తమ దారి తాము చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పొద్దున లేస్తే ఎవరు ఏ పార్టీలో వుంటారో తెలియడం లేదు. బెజవాడ వెస్ట్‌ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత జలీల్ ఖాన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ విజయవాడ వెస్ట్ స్థానాన్ని తమకు కేటాయించాలని కోరడంతో చంద్రబాబు ఓకే చెప్పారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి వుంది. కానీ అంతలోనే జలీల్ ఖాన్ ఇక్కడి రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. 

మైనారిటీలు తననే అభ్యర్ధిగా కోరుకుంటున్నారని.. లేనిపక్షంలో ఉరేసుకుంటారని చెప్పుకొచ్చారు. దీంతో జలీల్ ఖాన్‌ను బుజ్జగించేందుకు టీడీపీ హైకమాండ్ తమ దూతగా కేశినేని చిన్నిని రంగంలోకి దించింది. అధిష్టానం సూచనల మేరకు ఆయన పలుమార్లు జలీల్ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఎంతగా నచ్చజెప్పాలని చూసినా ఖాన్ మెత్తబడకపోవడంతో ఆయనను వెంటబెట్టుకుని నేరుగా నారా లోకేష్ దగ్గరికి తీసుకెళ్లారు చిన్ని.

మీ భవిష్యత్తుకు తనది భరోసా అని.. వెస్ట్‌లో కూటమి అభ్యర్ధి విజయం సాధించేలా కృషి చేయాలని లోకేష్ సూచించారు. అప్పటికీ సరేనన్న జలీల్ ఖాన్ సాయంత్రానికి షాకిచ్చారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన వైసీపీకి టచ్‌లోకి వెళ్లినట్లుగా బెజవాడలో ప్రచారం జరుగుతోంది. టికెట్‌పై అధికార పార్టీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ కూడా లభించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఉదయాన్నే తన ఇంటి వద్ద వున్న టీడీపీ జెండాను కూడా తీసేసినట్లుగా తెలుస్తోంది. పలుమార్లు చెప్పిచూసినప్పటికీ జలీల్ ఖాన్ వైఖరిలో మార్పు లేకపోవడంతో తెలుగుదేశం నేతలు తలపట్టుకున్నారట. ఆయన వైసీపీలో చేరడం దాదాపుగా ఖాయమైపోయిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి వుంది.