అమరావతి: ఈ నెల 19వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలను పురస్కరించుకొని ఎమ్మెల్యేలకు టీడీపీ బుధవారం నాడు విప్ జారీ చేసింది.ఏపీ అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  అయితే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉన్నారు.

కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్ కు మద్దతు ప్రకటించారు. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడ వైసీపీకి మద్దతుగా నిలిచారు.కరణం తనయుడు వెంకటేష్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కరణం బలరాం మాత్రం వైసీపీ కండువా కప్పుకోలేదు.

also read:మండలికి కీలక బిల్లులు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ దూరం: చంద్రబాబు ఫోన్

ఈ నెల 19వ తేదీన ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో ఉన్నాడు.  పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్యకు ఓటు వేయాలని కోరుతూ బుధవారం నాడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు.పార్టీకి దూరంగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా ఈ విప్ ను పంపారు. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తీసుకొంటామని టీడీపీ హెచ్చరించింది.

ఈ నెల 19వ తేదీన దేశంలోని 18 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలుజరగనున్నాయి. ఏపీ నుండి రాజ్యసభకు వైసీపీ  తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి వర్ల రామయ్య బరిలో ఉన్నారు.