టిడిపి తరపున గెలిచిన సర్పంచ్ లను వైసిపిలో చేర్చుకోడానికి తెరవెనుక మంతనాలు జరుగుతున్నాయి.
గుడివాడ: గత అసెంబ్లీలో ఘనవిజయం తర్వాత వైసిపి పార్టీలోకి టిడిపి ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా పంచాయితీ ఎన్నికల్లోనూ అలాగే జరిగేలా కనిపిస్తోంది. టిడిపి తరపున గెలిచిన సర్పంచ్ లను వైసిపిలో చేర్చుకోడానికి తెరవెనుక మంతనాలు జరుగుతున్నాయి. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం బహిరంగంగానే టిడిపి సర్పంచ్ లకు వైసిపి కండువా కప్పే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈ క్రమంలోనే నందివాడ మండలం పెదలింగాల టిడిపి సర్పంచ్ కలపాల సుధారాణి భర్త నాగులు, మద్దతుదారులతో గుడివాడలో ఇవాళ మంతనాలు జరుపుతున్న మంత్రి కొడాలి నాని. మంత్రితో సమావేశం అనంతరం వైసిపిలో చేరేందుకు సుధారాణి భర్త నాగులు, మద్దతుదారులు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో మంత్రి కొడాలి నాని సమక్షంలో సర్పంచ్ కలపాల సుధారాణి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరి కొంతమంది టిడిపి సర్పంచులు మంత్రి కొడాలి నానితో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
read more యలమర్రు మా పూర్వీకులది.. నాది గుడివాడే: టీడీపీకి కొడాలి నాని కౌంటర్
గుడివాడ రూరల్ మండలం సిద్ధాంతం గ్రామ పంచాయతీకి ఇండిపెండెంట్ గా పోటీ చేసి సర్పంచ్ గా గెలిచిన యిస్సా కృష్ణమూర్తి కూడా ఇవాళ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తిని అభినందించారు కొడాలి నాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కృష్ణమూర్తి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కలపాల సుధారాణి, యిస్సా కృష్ణమూర్తి ఒకేరోజు వైసిపిలో చేరనున్నట్లు... అందుకు ముహూర్తం కూడా ఖరారయినట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌గా పోటీ చేసి నారా లోకేష్ గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళతానని కొడాలి నాని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. కుట్రలు చేయడం దిక్కుమాలిన టీడీపీ అలవాటేనని... తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో 83 శాతం సీట్లను వైసిపి గెలిచిందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గంలో 48 పంచాయితీల్లో 44 గెలిచినట్టుగా ఆయన తెలిపారు. చంద్రబాబు మాటలు విని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేతలు ఇప్పుడు ఏడుస్తున్నారన్నారు
