అమరావతి: ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ కు   టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ సోమవారం నాడు లేఖ రాశాడు.

శనివారం నుండి ఏలూరులో ప్రజలు వింత వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం వరకు 340 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.బాధితులంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. గత కొద్దిరోజులుగా ఏలూరులో  ఆరోగ్య సంక్షోభం నెలకొందన్నారు.
వందలాది మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారన్నారు.

క్షేత్ర స్థాయిలో బాధితుల కష్టాలు చూసిన తాను ఎంతో ఆవేదన చెంది షాక్ కు గురయ్యానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉందన్నారు. అందుకే అత్యవసర పరిస్థితి గా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన కోరారు.

కొంతమంది మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో చేరారని ఆయన చెప్పారు. ఈ వ్యాధికి గల మూలాలు ఇంకా  తెలియలేదన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వమూ అంతగా శ్రద్ధ పెట్టలేదని లోకేష్ ఆరోపించారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గం లోనే ఈ పరిస్థితి నెలకొన్నా అధికారులు తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఉదాసీనంగా ఉందన్నారు.

also read:ఏలూరుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం: రేపు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశం

ప్రస్తుత ఏలూరు ఘటన మానవ విషాదంగా మారకుండా ఎలా నియంత్రించాలో అధికారులకు తెలియదన్నారు.  రికవరీ రేట్లను అధికంగా నమోదు చేయటానికి బాధిత రోగులను త్వరగా డిశ్చార్జ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

 ప్రజల ఆరోగ్యం పై దృష్టి పెట్టకుండా మాస్ హిస్టీరియా అంటూ ప్రచారం చేయడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.  మూర్ఛ బారిన పడిన బాధితులు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏలూరులో  ప్రజలను కాపాడేందుకు కేంద్ర జోక్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.