మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారంనాడు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశాడు.  

అమరావతి:మేలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారంనాడు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశాడు. మూడు వారాల ఆందోళన, న్యాయపోరాటం తర్వాత ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మే నెల‌లో జరిగే అన్ని పరీక్షలు వాయిదా వేయడమో లేదా ర‌ద్దు చేయాల‌ని ఆయన కోరారు. రాష్ట్రంలో కరోనా ఉధృతమైన ప‌రిస్థితుల్లో రోజు వారీ కరోనా పరీక్షల నిర్వహణ లక్ష దాటటంలేదని ఆయన విమర్శించారు.

ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో అనేక మంది చనిపోతున్నారని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. మే 2021 లో జరగాల్సిన ఆఫ్‌లైన్ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని కేంద్ర సంస్థలను ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మే లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నట్టుగా ఆయన చెప్పారు. జూన్ మొదటి వారంలో మళ్లీ పరిస్థితిని సమీక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. వివిధ రకాల ప్రవేశ పరీక్షలు, కళాశాల సెమిస్టర్ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి పోటీ పరీక్షలు రాష్ట్రంలో జరగాల్సి ఉంది.