అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసు: ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా ఏపీ సీఐడీ చేర్చిన విషయం తెలిసిందే.
అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారంనాడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్ ను ఏపీ సీఐడీ చేర్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1 గా ఏపీ సీఐడీ చేర్చింది. అయితే ఇదే కేసులో నారా లోకేష్ ను ఏ 14 గా చేరుస్తూ సీఐడీ అధికారులు కోర్టులో ఈ నెల 26న మెమో దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేయడంలో లోకేష్ చక్రం తిప్పారని సీఐడీ ఆరోపణలు చేసింది. తమకు సంబంధించిన వారికి ప్రయోజనం కల్గించేలా ప్రయత్నాలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది.
లింగమనేని రమేష్ భూములకు ప్రయోజనం కలిగేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ కేసులో తన పేరును చేర్చడంపై లోకేష్ మండిపడ్డారు. ఆరు మాసాల తర్వాత జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో తనకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తన పేరును ఉద్దేశ్యపూర్వకంగా చేర్చారని లోకేష్ పేర్కొన్నారు.
also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం: హెరిటేజ్ ఫుడ్స్ పై కేసు నమోదు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టైన తర్వాత ఆయనపై వరుస కేసులను నమోదు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబుపై పీటీ వారంట్లను దాఖలు చేసింది. ఈ నెల 29వ తేదీన రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.ఈ తరుణంలో ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ 14గా సీఐడీ చేర్చింది.దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టైన తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడే ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై విచారణ తర్వాత లోకేష్ న్యూఢిల్లీ నుండి రాజమండ్రికి తిరిగి రానున్నారు.