న్యూ ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు ఎంపీ  సుజనా చౌదరి. అంతేకాదు 2014లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వననిక కేంద్రం చెప్పడంతో కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ సెంట్రల్ కేబినెట్ నుంచి తప్పుకున్నారు సుజనా చౌదరి. అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనపై మనీలాండరింగ్ కేసులు,సీబీఐ కేసులు కూడా నమోదు అయ్యాయి. 

2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయాడు. తనతోపాటు నలుగురు  రాజ్యసభ సభ్యులను సైతం బీజేపీలోకి తీసుకెళ్లి రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశాడు. 

అంతేకాదు ఏపీలోని టీడీపీ నేతలను, న్యూట్రల్ గా ఉన్న నేతలను సైతం బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అలాగే తన వ్యాఖ్యలతో ఏపీలో గందరగోళం సైతం సృష్టిస్తున్నారు సుజనా చౌదరి. 

సుజనా చౌదరి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతుందంటూ పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అంతేకాదు ఇటీవలే టీడీపీ, వైసీపీలకు చెందిన 20 మంది ప్రజాప్రతినిధులు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

సుజనా ఊరికినే అనలేదు: గోడదూకనున్న 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఇలాంటి తరుణంలో న్యూఢిల్లీలోని సుజనా చౌదరి నివాసానికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వెళ్లడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సుజనా చౌదరి నివాసంలోనే జేపీ నడ్డా విందు ఆరగించారు. ఆ సమయంలో మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కూడా సుజనా ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 

సుజనా చౌదరి నివాసంలో జేపీ నడ్డాతో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎందుకు భేటీ అయ్యారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాకతాళీయంగానే జేసీ దివాకర్ రెడ్డి సుజనా చౌదరి ఇంటికి వెళ్లారా లేక వ్యూహంలో భాగంగా వెళ్లారా అన్న చర్చ జరుగుతుంది. 

ఇకపోతే ఏపీలో బీజేపీ సొంతంగా బలోపేతం కావాలని వ్యూహం రచిస్తోంది. ఏపీలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగింది. 2024 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 

2019 ఎన్నికల ముందు వరకు వైసీపీ బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీని విమర్శిస్తూ పరోక్షంగా వైసీపీని సమర్ధిస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అంతేకాదు ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు నానా హంగామా చేశారు కూడా. 

అయితే జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బీజేపీ కాస్త దూరమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రంతో కూడా జగన్ కు చెడిందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో బీజేపీ జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

వైసీపీలోకి సుజనా, ఎందుకు ఆగారంటే...: ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఇసుక కొరత, రాజధాని నిర్మాణాల నిలిపివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, గ్రామ వాలంటీర్ల నియామకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతోంది. ఏపీలో జగన్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తామే వైసీపీకి ప్రతిపక్షం అంటూ చెప్పుకుంటోంది.  

ఇలాంటి తరుణంలో జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్యలో జగన్ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్‌ అధికారంలోకి రావడంతో ఆయనపై ప్రజల్లో అంచనాలకు మించిన ఆశలున్నాయని నడ్డాకు వివరించారట. 

అయితే ప్రజల ఆశలకు తగ్గట్టుగా జగన్‌ పాలన సాగకపోతే అసంతృప్తి రాజుకుంటుందనీ, ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే నెలకొందని కూడా నడ్డాకు వివరించారట జేసీ దివాకర్ రెడ్డి. జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, కోర్టు కేసులు వంటి అంశాలపై కూడా వివరించారట. 

అనంతపురంలో తన బస్ ట్రావెల్స్‌పై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై సాగుతున్న కక్షసాధింపులను కూడా నడ్డాకు వివరించారట జేసీ దివాకర్ రెడ్డి. రాజకీయాల్లో మరీ ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం భావ్యం కాదని నడ్డా అన్నట్లు సమాచారం. 

అనంతరం సుజనా చౌదరి, జేపీ నడ్డాలు గంట సేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ బలోపేతంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. డిసెంబర్ 8న ఏపీలో జేపీ నడ్డా పర్యటిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు, బీజేపీలో చేరికలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

అక్కడేమైనా తేడా కొట్టిందా: జగన్ ఉక్కిరిబిక్కిరి, జట్టుకడుతున్న ప్రతిపక్షాలు

అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వివాదాస్పదమైన నిర్ణయాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ మీడియాలో సైతం ఏపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేక కథనాల గురించి సైతం ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో ఏం జరుగుతుందనే దానిపై లోతైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సుజనా చౌదరిని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా ఆదేశించినట్లు తెలుస్తోంది.