అమరావతి : తన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు. సుజనా చౌదరితో వైసీపీ ఎంపీలు ఎవరూ టచ్ లో లేరని చెప్పుకొచ్చారు. 

అయితే జగన్ అంగీకరిస్తే వైసీపీలో చేరేందుకు సుజనా చౌదరి రెడీ గా ఉన్నారంటూ సుజనాపై బాంబు పేల్చారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. జగన్ ఆదేశం కోసం వెయిటింగ్ లో ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని నిరేంద్రమోదీని కలిసినంత మాత్రాన తాను బీజేపీతో టచ్ లో ఉన్నారని అనడం ఏమాత్రం భావ్యం కాదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఎవరూ కూడా పార్టీ మారరని స్పష్టం చేశారు. 

మోదీని కలిస్తే తప్పా, అడక్కుండానే వివరణ ఇచ్చా: జగన్ తో భేటీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు

బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 20మంది టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకువెళ్లాలని సుజనా చౌదరికి సూచించారు రఘురామకృష్ణంరాజు. 

వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేనందునే తాను వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. ఊహాజనితంగా మాట్లాడటం సరికాదన్నారు. ఎవరైనా టచ్‌లో ఉంటే వారి పేర్లు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందన్నారు. పరిణితి చెందిన ఏ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దూరం కారని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. 

సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ: మీడియం రగడపై వివరణ

సుజనా చౌదరి చేసిన ఆరోపణలు టీ కప్పులో తుఫాన్‌లాంటివి మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలుగు భాషపై దుమారం చెలరేగిందని అయితే శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వివరణ ఇచ్చానని ఆ సమస్య అక్కడితో సమసిపోయిందన్నారు.