అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా పూర్తికాకుండానే దీక్షలు, ర్యాలీలు వంటి ఆందోళనలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రతిపక్షాలు. 
 
ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడిన వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందట. ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం చేశారో గానీ నిత్యం ఏదో ఒక సమస్యలతో ప్రభుత్వాన్ని ఇరుక్కున పెడుతున్నారంటూ చర్చిస్తున్నారట. జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముహూర్తంపై చర్చిస్తున్నారట. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరదలు వచ్చాయి. సుమారు నెలరోజులపాటు ఏపీ రాజకీయాలన్నీ వరదల చుట్టూనే తిరిగాయి. 

ఆ తర్వాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఆ అంశంపై కూడా సుమారు నెల రోజులపాటు ఏపీ రాజకీయాలు నడిచాయి. 

అనంతరం ఇసుక కొరత అంశం. ఇసుక అంశం అయితే ప్రభుత్వాన్ని ఊపిరిసలపనివ్వలేదంటే నమ్మండి. జగన్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువల నీళ్లు తాగించాయి ప్రతిపక్షాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ప్రతిపక్ష పార్టీలు పోటీపడి మరీ నిరసనలకు దిగాయి. అంతేకాదు పాతమిత్రులు, వైసీపీ ఆరోపిస్తున్నట్లు రాజకీయ మిత్రులు టీడీపీ-జనసేనలు ఏకమై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇసుక కొరతను నిరసిస్తూ పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు టీడీపీ మద్దతు పలికింది. మద్దతు పలకడమే కాదు లాంగ్ మార్చ్ లో సైతం పాల్గొన్నారు మాజీమంత్రులు. 

అటు ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇసుక దీక్షకు సైతం జనసేన మద్దతు ప్రకటించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వచ్చి చంద్రబాబు దీక్షకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లతోపాటు బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం ఇసుక కొరతపై పెద్ద రాద్ధాంతమే చేశాయి. దాంతో జగన్ సర్కార్ దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. 

ఇసుక కొరతను అధిగమించేందుకు నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. వారం రోజులపాటు ఇసుక వారోత్సవాలకు పిలుపు ఇచ్చారు. మంత్రులు, అధికారులు వారం రోజులపాటు ఇసుకపై పనిచేసి ఎలాగోలా ఇసుకను అందుబాటులోకి తెచ్చారు. 

ఇసుక కొరతను తీర్చాం హమ్మయా అంటూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగు భాష చనిపోతుందని, తెలుగు సంప్రదాయం, సాంస్కృతిలు మంటగలిసిపోతాయంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలు ఆరోపించాయి. ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టాయి. 

ఇంగ్లీషు మీడియం విషయంలో బీజేపీ సైతం తమ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా హిందీనేర్చుకోవాంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపును సమర్థించిన నేతలు ఏపీలో జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 

ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా సీఎం జగన్ వెనకడగు వేయలేదు. ఇంగ్లీషు మీడియం పెట్టక తప్పదని తేల్చి చెప్పేశారు. అంతేకాదు ఒక ఐఏఎస్ అధికారిని అందుకు బాధ్యుడిగా నియమించారు. ఇంగ్లీషు మీడియం అమలుకు జీవో సైతం జారీ చేశారు. 

ఇలా సీఎం వైయస్ జగన్ వరుస సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆఖరికి మద్యపాన నిషేధంపై కూడా విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో 80 శాతం హామీలు పూర్తి చేశాడని చెప్పుకొచ్చారు. దాన్ని ఓర్వలేక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కితగ్గకపోవడంతో ఏ ముహుర్తంలో ప్రమాణ స్వీకారం చేశారో గానీ ఈ గోల తప్పడం లేదంటూ వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారట. 

అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగా ఎంతో అద్భుతమైన పాలన అందిస్తున్నప్పటికీ ఎందుకు తమ ప్రభుత్వంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ వైసీపీ నేతలు అంతర్మథనం చెందుతున్నారట. ముహూర్తం ఏమైనా ఎక్కడైనా బెడిసి కొట్టిందా అంటూ ఆరా తీస్తున్నారట.