Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు మరో షాక్: వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి?

కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీని వీడుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఆయన త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

TDP ex MLA BC Janardhan Reddy may join in YCP
Author
Kurnool, First Published Mar 18, 2020, 11:54 AM IST

కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేఈ ప్రభాకర్ ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డిని ఆయన కలిసినట్లుగా జిల్లాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ,  మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీలో చేరనున్నారని జిల్లా లో జోరుగా చర్చ జరుగుతోంది.

వైసీపీ ముఖ్యనేత , ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం అయ్యారని జిల్లాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోమవారం హైదరాబాదులో ఇరువురు నేతల సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయివైసిపిలో చేరడం లాంఛనప్రాయమే బిసి అనుచరులు అంటున్నారు. 

Also Read: టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి శమంతకమణి, యామినీబాల

అదే జరిగితే కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలనుంది. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో బలమైన నేతగా ఆయనకు పేరుంది. అది తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. గత రెండు మూడు రోజులుగా జనార్దన్ రెడ్డి పార్టీ మారుతారనే వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ సోమవారం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వైసిపి ముఖ్యనేత , ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో భేటీ అయ్యారని అంటున్నారు. వీరి మధ్య సుమారు  పలు అంశాలపై చర్చలు జరిగినట్లు ఇరువర్గాలు అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. 

2014లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నుండి  టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డి పై 17,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా వారిలో  బీసీ జనార్దన్ రెడ్డి ఒకరు..

2019 ఎన్నికల్లో వైసీపీకి  బీసీ జనార్దన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో అత్యల్ప ఓట్లు మెజార్టీతో ఓటమి పాలయ్యారు  సుమారు 13 వేల ఓట్ల మెజార్టీతో ఓటమి పాలు కావడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డిఓటమిపాలైన ప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు.

జనార్దన్ రెడ్డి పార్టీ వీడుతున్నారు అన్న ఊహాగానాలు టిడిపి వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే బీసీ జనార్దన్ రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఈ నెల 24న గాని ,  26న గానీ లాంఛనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జనార్దన్ రెడ్డి పార్టీ  తెలుగుదేశం పార్టీని వీడేది లేనిది త్వరలో తేలిపోతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios