ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్ తగలింది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడగా... తాజాగా మరో ఇద్దరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరుతున్న  నేతల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల కూడా చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో నేడు వీరిద్దరూ వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ పార్టీ అనుచరులతో కలిసి విజయవాడ బయలుదేరినట్టు సమాచారం.

Also Read ఆది నారాయణ రెడ్డి దెబ్బ... వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు...

నిజానికి వీరిద్దరూ పార్టీని వీడబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ సమయంలో శమంతకమణి శాసనమండలికి గైర్హాజరయ్యారు. ఆ క్షణం నుంచే ఆమె పార్టీని వీడబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇటీవల యామినీబాలకు కూడా వైసీపీ నుంచి పిలుపు రావడంతో ఇద్దరూ కలిసి నేడు జగన్ సమక్షంలో ఆ పార్టీ  కండువా కప్పుకోవాలని నిర్ణయించారు.

ఇదిలా ఉండగా... ఇటీవల మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, ఆయన  తనయుడు మధుసూదన్ రెడ్డిలు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరికి స్వయంగా ముఖ్యమంత్రి జగనే వైసిపి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. 

ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు గాదె. వరుసగా మూడుసార్లు అక్కడినుండి  గెలిచి ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామల నేపథ్యంలో బాపట్ల కుమారారు. ఆ నియోజకవర్గం నుండి కూడా 2004, 2009 లో పోటీచేసి గెలుపొందారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రి పదవులు పొందారు. 

ఇక 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినడంతో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుండి టిడిపిలోనే  కొనసాగుతూ వస్తేన్న గాదె తాజాగా జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకుని అందరనీ ఆశ్చర్యపర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వున్న అనుబంధమే ఆయనను వైఎస్ జగన్ చెంతకు చేర్చిందని వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. 

స్థానికసంస్థల ఎన్నికల వాయిదా పడటంతో వలసలు కూడా ఆగుతాయని భావించిన టిడిపికి ఈ చేరిక ద్వారా షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీని ఏమాత్రం కోలుకోనివ్వకుండా దెబ్బతీసి స్థానికసంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలన్న ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ఇంకా కొనసాగుతూనే వుంది. ఎన్నికలు   ముగిసే వరకు ఈ చేరికలు ఆగవన్న సంకేతాలను గాదె వెంకటరెడ్డి ని చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు పంపించారు జగన్. ఈ వరస వలసలు చూస్తుంటే.. మళ్లీ ఎన్నికల నాటికి టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.