అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. 

మంతెన అనంతవర్మ 1999-2004 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ఆయన వైసీపీలో చేరారు.   అనంత వర్మతో పాటు ముఖ్యమంత్రి సమక్షంలో స్ధానిక టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి. వెంకటేశ్వరరాజు, ఎం.వి. సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి వైసీపిలో చేరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కూడా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

శాసనసభ్యులు వల్లభనేని వంశీ, కరణం బలరాం తదితరులు ఇప్పటికే టీడీపీకి దూరమయ్యారు. సాంకేతికంగా మాత్రమే వారు వైసీపీలో చేరలేదు. వారు జగన్ వెంట ఉంటున్నారు. తాజాగా మంతెన అనంతవర్మ వైసీపీలో చేరడం ద్వారా టీడీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.