మూడు రోజులుగా టిడిపి నేతలు ఒకటే శాపనార్ధాలు పెడుతున్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే బిజెపికి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది’ అని శాపనార్దాలు పెడుతున్నారు. సరే, ‘పిల్లి శాపనార్ధాలకు ఉట్టి పగులుతుందా’ అన్నది వేరే సంగతి. కానీ టిడిపి నేతలు విస్మరిస్తున్న విషయం ఒకటుంది.

రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తే బిజెపికే కాదు ఎవరికైనా అదే గతిపడుతుంది. ఎందుకంటే, ఇప్పటికే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్న అనుభవం టిడిపికుంది. ప్రజాక్షేమాన్ని విస్మరించిన కారణంగానే టిడిపిని జనాలు ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం చేశారు. ఏదో వైఎస్ హఠాన్మరణం కారణంగా రాజకీయాలు ఒక్కసారిగా మలుపులు తిరిగి రాష్ట్ర విభజనకు దారితీసాయి. సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయింది కాబట్టే టిడిపికి అధికారం అందుకునే అవకాశం వచ్చింది.

సరే, ఇక ప్రస్తుతానికి వస్తే బిజెపికి కూడా కాంగ్రెస్ గతే పడుతుందనటంలో అర్ధమే లేదు. ఎందుకేంటే, బిజెపికి ఉన్నదేముంది? పోవటానికి? దేశమంతా మోడి వేవ్ ఉన్న రోజుల్లోనే ఏపిలో బిజెపి గెలిచింది నాలుగు ఎంఎల్ఏ సీట్లు, రెండు ఎంపి స్ధానాలు అంతే. మహా అయితే, గెలిచుకున్న సీట్లలో ఓడిపోతుంది. దాంతో బిజెపికి వచ్చే నష్టమేమీలేదు.

కాకపోతే కాంగ్రెస్ గతి పట్టకుండా చూసుకోవాల్సింది టిడిపినే. ఎందుకంటే, అధికారంలో ఉన్న టిడిపి బిజెపికి మద్దతు ఇవ్వటం వల్ల ప్రతిపక్షంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే, మొదటి నాలుగు బడ్జెట్లలోనూ కేంద్రం ఏపికి మొండిచెయ్యి చూపినా చంద్రబాబునాయుడు నోరెత్తలేదు. పైగా ఎప్పటికప్పుడు కేంద్రం బ్రహ్మండమని, అవసరమైనదానికన్నా ఎక్కువే ఇస్తోందంటూ స్తోత్రపాఠాలు వినిపించారు.

ఇపుడింత హటాత్తుగా ఎందుకు హడావుడి చేస్తున్నారంటే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అన్న విషయం అందరకీ తెలిసిందే. ప్రభుత్వంపై జనాల్లోని ఆగ్రహాన్ని బిజెపి పైకి మళ్ళించి తాను సేఫ్ అయిపోదామని చంద్రబాబు వ్యూహం. జనాలేమైనా పిచ్చోళ్ళా? చంద్రబాబు ఆడమన్నట్లు ప్రతీసారి ఆడటానికి? రేపటి ఎన్నికల్లో తెలుస్తుంది కాంగ్రెస్ గతి బిజెపి, టిడిపిల్లో ఎవరికి పడుతుందో?