సారాంశం

టీడీపీ కౌన్సిలర్ రామరాజు నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు.  ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోయినట్టుగా ఆయన  చెప్పారు.
 

విశాఖపట్టణం: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం  మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారంనాడు  గందరగోళం చోటు  చేసుకుంది. తమ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించాలని  పలువురు కౌన్సిలర్లు  కోరారు. ఇవాళ  మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన  నర్సీపట్నం  మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.  

 మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైనా ప్రజల సమస్యలను  పరిష్కరించడంలో తాను  విఫలమైనట్టుగా  టీడీపీ కౌన్సిలర్  రామరాజు ఆవేదన వ్యక్తం  చేశారు. కౌన్సిలర్ గా ఎన్నికైన  30 నెలలు అవుతున్నా  తన వార్డులో  మంచినీటి కుళాయిని కూడ ఏర్పాటు చేయించలేని పరిస్థితి నెలకొందని ఆయన  తన నిస్సహాయతను వ్యక్తం  చేశారు.  

 టీడీపీ కౌన్సిలర్ రామరాజు చెప్పుతో కొట్టుకున్నారు.  తన  వార్డులో  ప్రజల సమస్యలను  పరిష్కరించలేదని రామరాజు కౌన్సిల్ సమావేశంలోనే  చెప్పుతో కొట్టుకున్నాడు.మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ రామరాజు తన  వార్డులో సమస్యలను  ఏకరువు పెట్టారు.

ఈ సమస్యలను ఎప్పుడు  పరిష్కరిస్తారని  ఆయన  చైర్మెన్ ను నిలదీశారు.ఈ విషయమై  చైర్మెన్ తో వాగ్వాదానికి దిగారు.  కౌన్సిలర్ గా  తనను ఎన్నుకున్న ప్రజలకు  తాను ఏం చేయలేకపోయాయనని  టీడీపీ కౌన్సిలర్ రామరాజు   తన చెప్పుతో చెంపపై కొట్టుకున్నారు. రామరాజు పక్కనే  కూర్చున్న మరో కౌన్సిలర్  రామరాజును  వారించారు.

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే  తాను  కౌన్సిలర్ గా  పోటీ చేసినట్టుగా రామరాజు చెప్పారు.   రోడ్లు  కూడ సరిగా  లేవన్నారు.  చెత్త తీసుకెళ్తేందుకు   కూడ శానిటేషన్ సిబ్బంది కూడ  సక్రమంగా రావడం లేదని  టీడీపీ కౌన్సిలర్ రామరాజు ఆవేదన వ్యక్తం  చేశారు.  తన వార్డులో సమస్యలను  చెప్పుకుంటూ  టీడీపీ కౌన్సిలర్   భావోద్వేగానికి గురయ్యారు.