ప్రజలను పాలించే నాయకులు కులమతాలు, పార్టీలు చూడొద్దని ప్రతిపక్ష నేేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సూచించారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ఏదో తెలియదని... ఈయనకు రైతుల బాధలేం తెలుస్తాయని మాజీ టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అధికారం చేతుల్లో వుండటంతో ఆయనకు అహంభావం నరనరాన నిండిపోయిందని... ఈ అజ్ఞాని వల్ల లక్షలాది రైతు కుటుంబాలు రోడ్డునపడ్డాయని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రంపై తుఫాను విరుచుకుపడితే రైతులు విలవిల్లాడిపోయారని... కానీ మన ముఖ్యమంత్రికి ఎన్ని లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందో కూడా తెలియదన్నారు. చివరకు ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో కూడా ఈ సీఎం చెప్పలేకపోతున్నాడని ఎద్దేవా చేసారు. మీ ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు మీ తలపైనే భస్మాసురహస్తం పెడుతున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. 

మిచౌంగ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగిందో చెప్పగలరా అంటూ సీఎం జగన్, మంత్రులకు చంద్రబాబు సవాల్ విసిరారు. ఆకాశంలో తిరిగితే రైతుల బాధలు కనబడతాయా? ఏ పంట కాలువ తెగిపోయిందో... ఏ పంటకు ఎంతమేర నష్టం జరిగిందో ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. భూమిపై తిరుగుతూ ప్రజల మధ్యకు వెళితే అన్నీ తెలుస్తాయని... అప్పుడు ఏం చేయాలి? రైతులను ఎలా ఆదుకోవాలి? అనేది తెలుస్తుందన్నారు. కాబట్టి సీఎం జగన్ ఏరియల్ సర్వేలు చేయడం మానుకోవాలని... ప్రజల్లోకి రావాలని చంద్రబాబు సూచించారు. 

ప్రకృతి విపత్తులు సంబవించి ప్రజలు సర్వస్వం కోల్పోతే ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనని... కానీ జగన్ సర్కార్ ఆ పని చేయడంలేదని చంద్రబాబు అన్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే రైతులను నట్టేట ముంచిందని అన్నారు. తనను టార్గెట్ చేసి కష్టపెడితే సహించాను కానీ ప్రజలను కష్టపెడితే చూడలేకపోతున్నానని అన్నారు. అందుకోసమే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

Also Read TDP - YSRCP : ఎన్నికలప్పుడు ముద్దులు .. తర్వాత గుద్దులు : జగన్‌పై చంద్రబాబు సెటైర్లు

ప్రజలను పాలించే నాయకులు కులమతాలు, పార్టీలు చూడొద్దని... ఎవరికి ఏ కష్టమొచ్చినా తీర్చాలని చంద్రబాబు సూచించారు. కానీ జగన్ సర్కార్ కు అసలు మానవత్వమే లేదని... రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడన్నారు. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలని తాను తపన పడుతున్నానని... కానీ జగన్ పాలనలో అది సాధ్యంకాదని చంద్రబాబు అన్నారు. 

వైసిపి ప్రభుత్వం ఇప్పటికే రూ. 11 లక్షల కోట్లు అప్పు తెచ్చింది.... ఈ డబ్బులన్నీ ఏమయ్యాయి? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ది జరగలేదు, సామాన్యులు, నిరుపేదల బ్రతుకులు మారలేదు, ఇలాంటి విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడం లేదు... మరి అప్పుతెచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. జగన్ చేసిన తప్పుడు పనుల వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు.