దుర్మార్గులు... నా భార్యను కూడా వదల్లేదు..: చంద్రబాబు ఎమోషనల్
ఆంధ్ర ప్రదేశ్ లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన టిడిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గత వైసిపి పాలనలో తన భార్యకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుని ఎమోషన్ అయ్యారు..
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం మరోసారి చేతులుమారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోయారు... మరోసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏకంగా 164 సీట్లు సాధించింది... వైసిపి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. ఈ స్థాయి విజయాన్ని బహుశా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా ఊహించివుండరు. ఇలా అద్భుత విజయాన్ని అందుకున్న టిడిపి మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది.
అయితే ఈ అద్భుత విజయంపై తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ క్రమంలోనే తనకు రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తాను చాలా ధైర్యవంతుడినని... తనపై బాంబులు వేసినా భయపడలేదు... కానీ తన భార్యను అంటుంటే తట్టుకోలేకపోయానని ఎమోషన్ అయ్యారు. ఆనాడే వైసిపిని ఓడిస్తానని...తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసానన్నారు... ఇప్పుడు గెలిచి చూపించానని చంద్రబాబు అన్నారు.
వైసిపి నాయకులు అధికార మదంతో కన్నూమిన్ను కానకుండా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇదే శాసనసభలో తన భార్య గురించి నీచంగా మాట్లాడి అవమానించారని చంద్రబాబు గుర్తుచేసారు. అప్పుడే ఈ కౌరవ సభకు ఇక రానని... దీన్ని గౌరవ సభగా మార్చాకే వస్తానని ఛాలెంజ్ చేసానన్నారు. అన్నట్లుగానే వైసిపిని ఓడించామని... అవమానపడ్డ అసెంబ్లీలోకి ఇప్పుడు గౌరవంగా వెళతానని అన్నారు.
గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో విజయాలు అందుకున్నాను... ముఖ్యమంత్రి అయ్యాను... రాష్ట్ర విభజన తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి గెలిచింది తామేనని చంద్రబాబు గుర్తుచేసారు. ఇలా చాలా ఎన్నికలు చూసాను... కానీ ఈ విజయం మాత్రం తమకెంతో ప్రత్యేకమని అన్నారు. తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని... తిరిగి గౌరవాన్ని ఇచ్చిన విజయం ఇదని చంద్రబాబు అన్నారు.
తాను ప్రాణాలను సైతం లెక్కచేయను... కానీ గౌరవాన్ని మాత్రం కోరుకుంటానని చంద్రబాబు అన్నారు. గతంలో తనపై బాంబులతో దాడిచేసి చంపాలని చూసారు... అప్పుడకు కూడా భయపడలేదు... వీరోచితంగా పోరాడానని అన్నారు. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో అవమానాలు చేస్తుంటే తట్టుకోలేకపోయానని అన్నారు. ప్రజలు కూడా వాళ్ల అరాచక పాలనను గమనించారు కాబట్టే తగిన గుణపాఠం చెప్పారని చంద్రబాబు అన్నారు.
వైసిపి పాలన అరాచకం... చివరకు మాట్లాడేందుకే కాదు బ్రతికేందుకు కూడా స్వేచ్చ లేకుండా పోయిందన్నారు. చివరకు జై వైసిపి అనలేదని టిడిపి కార్యకర్తలను హతమార్చారు... ప్రాణాలు పోతున్న జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా కార్యకర్తల త్యాగాలు, ఐదేళ్ళ కష్టాల ఫలితమే ఈ విజయమని అన్నారు. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనాన్ని ప్రజలు క్షమించరు... ఇప్పుడు అదే జరిగింది... ప్రజలే వైసిపికి తగిన గుణపాఠం చెప్పారన్నారు.
టిడిపి, జనసేనను కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసింది పవన్ కల్యాణే... బిజెపిని కూడా కూటమిలో చేర్చేందుకు కృషిచేసింది ఆయనేనని చంద్రబాబు అన్నారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిస్తేనే ఈ విజయం సాధ్యమయ్యిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా కూటమి గెలుపుకోసం బాధ్యతగా పనిచేసారన్నారు. ఇలా అందరం కలిస్తేనే కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఇందులో టిడిపికి 45 వచ్చాయని... వైసిపికి కేవలం 39 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయని చంద్రబాబు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం దిశగా పనిచేస్తామని చంద్రబాబు తెలిపారు.