వైసీపీ ఎన్నో ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినా టీడీపీ శ్రేణులు విరోచితంగా పోరాడాయని ప్రశంసించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజలు సైతం తిరగబడి ఓటింగ్‌కు సహకరించారని చెప్పారు.

పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. టీడీపీ చొరవ వల్లే 82 శాతం ఓట్లు పోల్ అయ్యాయని చంద్రబాబు గుర్తుచేశారు.

4 గంటల నుంచి 10 గంటల వరకు టీడీపీ ప్రభంజనం కనిపించిందని.. ఆ తర్వాత నుంచి చీకటి రాజ్యం ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ గెలిచిన చోట రీకౌంటింగ్ చేయించారని.. తాము అడిగితే రీకౌంటింగ్‌కు అంగీకరించడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

అధికార పార్టీ ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని అవకతవకలు చేశారని ప్రతిపక్షనేత మండిపడ్డారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని... రాత్రిపూట ఎందుకు ఓట్ల లెక్కింపు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అలాంగే కౌంటింగ్ కేంద్రాల్లో రాత్రిళ్లు కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ఆయన నిలదీశారు.