కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు, ఇతర చర్యల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు.

పేదలు, రైతులు కుదేలయ్యారని.. ఇలాంటి పరిస్ధితుల్లో వారిని వైసీపీ నేతలు విరాళాల పేరుతో వేధించడం దుర్మార్గమని ఆయన తప్పుబట్టారు. వైసీపీ నేతలను చూస్తుంటే కరోనా భయాన్ని మించిన భయం కలుగుతోందని.. సహాయ చర్యల్లో కూడా రాజకీయం చేయడం హేయమని ఆక్షేపించారు.

Also Read:అరటి పండ్లు కూడా కడప నుండే...ఆ రైతుల పరిస్థితేంటి: జగన్ ను నిలదీసిన పవన్

తొలగించిన 25 లక్షల రేషన్ కార్డుదారులకు సాయం చేయకపోవడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. టెస్ట్‌లు పెరగకుండా కేసులు పెరిగినట్లుగా చూపిస్తున్నారని.. నిన్న నెగిటివ్‌గా చూపిన కేసులు ఈ రోజు పాజిటివ్‌గా చూపిస్తున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు.

హెల్త్ బులెటిన్లు, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, డ్యాష్ బోర్డ్ సమాచారంలో ఏది నిజమో తెలియక జనం ఆందోళన చెందుతున్నారని లేఖలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం దుశ్చర్య వల్లే రాష్ట్రంలో కోవిడ్ 19 ప్రభావం ఎక్కువ అవుతుందన్నారు.

Also Read:ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కరోనా పరీక్షలు: తేలిందేమిటో తెలుసా....

పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశావర్కర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రత్యర్ధులపై తప్పుడు కేసులు పెట్టడం వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు.

ప్రతి పేదకుటుంబానికి 5 వేల రూపాయల సాయం అందించాలని, సరైన నిర్ణయాలు తీసుకుని విపత్కర పరిస్ధితుల నుంచి ప్రజలను కాపాడాలని ముఖ్యమంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.