విజయవాడ: ఒక ప్రాంతానికి కాదు ప్రపంచమంతటికీ సవాల్ తో కూడిన పరిస్థితిని కరోనా సృష్టించిందని... ఇలాంటి విపత్కర కాలంలో అందరినీ కలుపుకొని వెళ్ళి ప్రజారోగ్యంపై పని చేసి సమాజానికి ధైర్యం ఇవ్వాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు లేదు అని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు చెప్పారు. ఇలాంటి తరుణంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని తొలి నుంచే చెబుతూ అందుకు తగ్గ విధంగానే ముందుకు వెళ్తున్నామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో కూడా వ్యక్తిగత వ్యవహారంలా భావిస్తూ కక్ష సాధింపు ధోరణితోనే పని చేస్తోందని అన్నారు. 

శుక్రవారం సాయంత్రం జనసేన నాయకులు, వీర మహిళలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వ్యాధి విస్తృతి, లాక్ డౌన్ పరిణామాలపై చర్చించారు.  ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో ప్రజలలో నెలకొన్న భయాందోళనలు, ప్రభుత్వ పని తీరు, రైతుల కష్టాలు, చిరు వ్యాపారులకు ఎదురవుతున్న నష్టాలు, రోజు కూలీల పరిస్థితుల గురించి నాయకులు వివరించారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ  “ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఈ మహమ్మారి ప్రభావంపై ఇటలీకి వ్యాప్తి చెందే వరకూ ప్రపంచ దేశాలు మేల్కొనలేదు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ కు పిలుపునివ్వడంతోపాటు తదనుగుణంగా చేపట్టిన చర్యలతో కరోనా కట్టడికి అందరూ సమాయత్తం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం'' అని అన్నారు.

''రాష్ట్రంలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాం. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజల పక్షాన మాట్లాడదాం. ప్రస్తుతం లాక్ డౌన్ పొడిగింపులో మనందరం ఉన్నాం. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండ్ల తోటల రైతుల సమస్యలు ప్రస్తావనకు వస్తున్నాయి. అరటి పంట కొనుగోలు, విక్రయాలలో ఉన్న రైతుల సమస్యలు, ఆందోళనలు నా దృష్టికి వచ్చాయి. గోదావరి జిల్లాల్లోనూ ఈ పంటను అమ్మే సమయం ఇది. అక్కడికీ కడప నుంచి తీసుకొచ్చి అరటి విక్రయిస్తుంటే స్థానికంగా ఉన్న పంటను అమ్ముకోవడం ఎలా అనే ఆందోళనలో రైతులు ఉన్నారనే విషయం నా దృష్టికి చేరింది'' అని అన్నారు. 

''అందరూ ఆరోగ్యంగా ఉండాలి. రోజు కూలీలు, చిరు వ్యాపారులు, పేదల కష్టనష్టాల గురించి దృష్టి సారించి తప్పకుండా మాట్లాడదాం. రైతులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేదలు, మహిళలు ఈ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ కార్యాలయానికి తెలియచేయండి. లాక్ డౌన్ మరికొన్ని వారాలు ఉంది కాబట్టి ఈ సమయంలో మనం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి త్వరలోనే తెలియచేస్తాను. జనసేన నాయకులు, జన సైనికులు ప్రతి జిల్లాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారందరికీ అభినందనలు. మీరు ఈ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. మీ అందరి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను” అన్నారు.