ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కరోనా పరీక్షలు: తేలిందేమిటో తెలుసా....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ పరీక్షలు చేియించుకున్నారు. ఆయన ఈ రోజు దక్షిణ కొరియా నుంచి వచ్చి ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రారంభించారు.

AP CM YS Jagan tested for coronavirus

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. అయితే, ఆయనకు నెగెటివ్ వచ్చింది. కరోనా పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించిన విషయం తెలిసిందే. క్యాంపు కార్యాలయంలో వాటిని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారానే వైద్యులు ముఖ్యమంత్రికి పరీక్షలు నిర్వహించారు.

కోవిడ్‌ –19 కంట్రోల్‌సెంటర్‌లో స్టేట్‌ కో–ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ రాంబాబు ముఖ్యమంత్రికి పరీక్ష నిర్వహించారు. ఈ ఉదయం దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లను పంపించింది. ఈ కిట్‌ ద్వారానే సీఎంకు వైద్యులు పరీక్ష నిర్వహించారు. కోవిడ్‌ –19 పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలెవ్వరూ సంకోచం చెందొద్దని, నిరభ్యంతరంగా, ఎలాంటి సందేహం లేకుండా టెస్టులు చేయించుకోవాలనే సందేశం ఇవ్వడానికి ముఖ్యమంత్రిగారు పరీక్ష చేయించుకున్నారని డాక్టర్‌ కె.రాంబాబు తెలిపారు. 

కేవలం ఒక రక్తపు బొట్టుతో ఈ పరీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా కోవిడ్‌–19 పరీక్షల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుందని, ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా కంటైన్‌మెంట్‌ జోన్లలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. పాజిటివ్‌ తేలినంత మాత్రాన ఎవ్వరూ ఆందోళన చెందవద్దని కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్లలో  మంచి వైద్య సదుపాయాలు, వసతులు ఉన్నాయని, మంచి ఆహారం, మంచి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అధికారుల సూచనతో ఆయన హోం క్వారంటైన్ లోకి వచ్చింది. హఫీజ్ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని, దాంతో ఆ విషయంపై స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశానని హఫీజ్ ఖాన్ చెప్పారు. 

ప్రజలను అప్రమత్తం చేయడానికి రెడ్ జోన్ ప్రాంతాల్లో తాను విరివిగా తిరిగానని, కరోనా వైరస్ వ్యాపిస్తున్న తొలి దశలో ప్రజలను చైతన్యవంతులను చేయడం అవసరంగా మారిందని ఆయన చెప్పారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, తనకు నెగెటివ్ వచ్చిందని, అయినప్పటికీ తాను హోం క్వారంటైన్ కు వెళ్తున్నానని ఆయన చెప్పారు. పరీక్షలు చేయించుకోవడం తప్పు లేదని చెప్పడం తన ఉద్దేశమని ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా 13 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 126కు చేరుకుంది. 

కరోనా వైరస్ వల్ల ఇటీవల మరణించిన వైద్యుడి ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా ఎమ్మిగనూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఎమ్మిగనూరులో మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. శ్వాససంబంధమైన సమస్యతో అతను ఇటీవల కర్నూలు ఆస్పత్రిలో చేరాడు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఢిల్లీ మర్కజ్ లింకులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64కు చేరుకుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios