అమరావతి:  రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినప్పటికీ.. ఫలితాలు ప్రకటించకుండా వైసీపీ నేతలు అధికారులను బెదిరిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు.   వైసీపీ నేతల బెదిరింపులు, అక్రమ కేసులను లెక్కచేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగులో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని... కానీ ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా ప్రజా తీర్పును తారుమారు చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

''వైసీపీ మద్దతు దారులు ఓడిపోయినచోట ఎన్నికలను ప్రకటించొద్దంటూ అధికారులను బెదిరిస్తున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్ద తిప్పసముద్రం మండలం టి.సదుమ్ గ్రామ పంచాయతీ, కరుబకోట మండలం కడప క్రాసు పంచాయతీ, పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలంలోని చర్లోపల్లి పంచాయతీ, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం తొగరకుంట,తుమ్మచర్ల, పాతపాలెం పంచాయతీ, రాప్తాడు మండలంలోని బోగినేపల్లి పంచాయతీ, ప.గో జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి మండలం కురుకూరు పంచాయతీ, చిలకలూరిపేట నియోజకవర్గంలోని గొట్టిపాడు పంచాయతీ, కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పోలుగొండ, ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం అయ్యప్పరాజు పంచాయతీ ఎన్నికల ఫలితాలను వెల్లడించకుండా అధికారులను బెదిరించారు'' అని చంద్రబాబు ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. 

'' పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగళ్లు మండలం ఎస్.ముప్పవరం గ్రామ పంచాయతీలో తెదేపా మద్దతు దారులు 6 వార్డులతో పాటు 250 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ స్థానాన్ని గెలవగా వైసీపీ నేతలు ఫలితాలు తారుమారు చేసి వైసీపీ మద్దతుదారు 4 ఓట్లతో గెలిచినట్లు చెబుతున్నారు. ఎస్.ముప్పవరం గ్రామంలో రీకౌంటింగ్ నిర్వహించి నిష్పాక్షికంగా ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలి'' అని సూచించారు.

read more   పంచాయతీలో షాక్: కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ మద్దతుదారు విజయం

''గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం కుంకులగుంట గ్రామంలో ఎస్ఐ ఉదయ్ బాబు ఏకపక్షంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులను ఉపయోగించి అధికార పార్టీ ఫలితాలను తారుమారు చేస్తోంది'' అని చంద్రబాబు ఆరోపించారు.

''తక్షణమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వైసీపీ నేతల బెదిరింపులతో నిలుపుదల చేసిన పంచాయతీల ఫలితాలను వెంటనే విడుదల చేయాలి.    ప్రజల హక్కుల్ని, వారి అభిప్రాయాలను గౌరవించి ఎన్నికల గౌరవాన్ని కాపాడాలి'' అని చంద్రబాబు కోరారు.