Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై వైసిపి నేత లైంగిక వేధింపులు...ఇదీ రాష్ట్రంలో పరిస్థితి : డిజిపికి చంద్రబాబు లేఖ

అప్రతిష్ట నుండి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ బయటపడేలా చూడాలంటూ ఏపీ డిజిపికి చంద్రబాబు లేఖ రాశారు. 
 

TDP Chief Chandrababu writes a letter to DGP
Author
Amaravathi, First Published Oct 5, 2020, 10:05 AM IST

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశంలో పోలీసులపైనే అత్యధికంగా కేసులు నమోదయిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ఇదే పోలీసుల పనితీరు ఎలా వుందో తెలియజేస్తుందని... ఈ అప్రతిష్ట నుండి రాష్ట్ర పోలీస్ వ్యవస్థ బయటపడేలా చూడాలంటూ ఏపీ డిజిపికి చంద్రబాబు లేఖ రాశారు. 

డిజిపికి చంద్రబాబు రాసిన లేఖ యధావిధిగా: 

విషయం: రాష్ట్రంలో ప్రాధమిక హక్కులు కాలరాయడం-కనీస చర్యలు లేకపోవడం-దేశంలో పోలీసులపై అత్యధికంగా వ్యక్తిగత కేసులు నమోదైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం-ఈ అప్రదిష్టను తొలగించేందుకు ప్రయత్నించడం- రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం-నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడం గురించి...

శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం అనేక దుర్ఘటనలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఏ కల్పించిన వాక్ స్వాతంత్ర్యంపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఈ విధమైన అప్రజాస్వామిక చర్యల గురించి మీ దృష్టికి తెచ్చి వాటిపై సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రతిపక్ష నాయకుడిగా నాపై ఉన్నాయి. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినవారిని వెంటాడటం, అర్ధరాత్రి అరెస్ట్ లు, హింసాత్మక దాడులు, ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు, దుర్భాషలు, అసభ్య ప్రచారం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం జరుగుతోంది. 

పోలీసుల ఈ విధమైన ఉదాసీనత, నిష్క్రియాపరత్వం అవాంఛనీయం, రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేనిది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులపైనే వ్యక్తిగత కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని ఎన్ సిఆర్ బి నివేదిక వెల్లడించడం రాష్ట్రానికే కళంకం. దేశవ్యాప్తంగా పోలీసులపై మొత్తం 4,068 కేసులు నమోదైతే అందులో 1,681 కేసులు(41%) ఆంధ్రప్రదేశ్ లోనే నమోదు కావడం ఆందోళనకరం. మనరాష్ట్రంలో పోలీసుల ప్రస్తుత పనితీరుకు ఎన్ సిఆర్ బి నివేదికలోని ఈ కేసుల సంఖ్యలే అద్దం పడుతున్నాయి.  పోలీస్ పరంగా రాష్ట్రంలో చట్టనిబంధనలను సక్రమంగా అమలు చేయలేక పోవడం, అధికార వైసిపితో కుమ్మక్కు కావడం, రాష్ట్రంలో జరుగుతోన్న అన్యాయాలపై శీతకన్ను వేయడం దురదృష్టకరం. 

రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ఎదుటే షేక్ సత్తార్ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకోవడం దీనికి మరో దృష్టాంతం.. మైనారిటీ తీరని కుమార్తెను అధికార వైసిపికి చెందిన వ్యక్తి అసభ్యంగా వేధించాడు. షేక్ సత్తార్ కుటుంబం ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్లు 354, 506 r/w 34 , 11 r/w 12 పోస్కో చట్టం  2012 కింద దీనిపై ఎఫ్ ఐఆర్ 578/2020 నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో నిందితుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఈ కేసును ఉపసంహరించుకోవాలని సత్తార్ కుటుంబంపై పోలీసుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు పెరిగాయి. ఈ హింసను తట్టుకోలేక, తమ ప్రాణాలు కాపాడాల్సిన కార్యాలయం ఎదుటే ప్రాణాలు తీసుకోడానికి తెగించిన షేక్ సత్తార్, అక్టోబర్ 1న  పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. 

మరోవైపు విజయవాడ నగరంలో అక్టోబర్ 3న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి బైట పార్క్ చేసిన కారుపై దాడిచేసి ధ్వంసం చేశారు. ఇంటి సమీపంలోనే పోలీసు పికెట్ ఉన్నప్పటికీ, నిందితులు అనేకమంది ఈ దాడిలో పాల్గొనడం గమనార్హం. ఈ విధ్వంసం వెనుక దురుద్దేశం వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలకు  వ్యతిరేకంగా మాట్లాడకుండా పట్టాభి గొంతు నొక్కాలని చూడటమే .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను గర్హిస్తూ గొంతెత్తిన టిడిపి నాయకులపై గొలుసుకట్టు దాడులు అనేకం దీనికి ముందుకూడా జరిగాయి. 

వీటితోపాటుగా బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, మహిళలు, జర్నలిస్ట్ లు ఇతర వర్గాల ప్రజలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. శిరోముండనాలు యధేచ్ఛగా రాష్ట్రంలో కొనసాగుతూనే ఉండటం విచారకరం. ఇవేకాకుండా దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలపై దాడులు దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను కాపాడే ప్రయత్నాలు చేయడానికి బదులుగా, వైఎస్సార్ సిపి ప్రభుత్వం తమను ప్రశ్నించేవారి భవనాలను అర్ధరాత్రి పూట కూల్చడమే పనిగా పెట్టుకుంది. 
ఈవిధమైన వరుస దుర్ఘటనలన్నీ పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టాయి. కాబట్టి ఇకనైనా రాష్ట్రంలో పోలీసులు ఏవిధమైన భయంతో కాకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పాక్షికంగా తమ విధులను నిర్వర్తించి శాంతిభద్రతల పరిస్థితులను పరిరక్షించాలి. రాష్ట్రంలో పెరిగిపోతున్న నేరాలకు అడ్డుకట్ట వేసి ప్రజల ప్రాధమిక హక్కులను కాపాడటం అత్యావశ్యకం. ఎటువంటి హింసా విధ్వంసాలు లేని, నిర్భీత వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కల్పించాలి.

చంద్రబాబు నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios