కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా సుబ్బారావు దారుణ హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరును చేర్చడంపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయి. ఇప్పుడిక తెలుగుదేశం నేతలపై హత్య కేసులు పెడుతున్నారు. పైగా బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారని చంద్రబాబు నిలదీశారు.

 

 

అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారు. బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే వైసీపీ మంత్రులు దాడి చేసారని అన్నారు.

ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై  హత్యకేసు బనాయిస్తారా? ఏమిటీ ఉన్మాదం? మీ ప్రలోభాలకు లొంగకపొతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం నేతలపై ఇంతకు తెగిస్తారా? మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా? అని ప్రతిపక్షనేత ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసిలే అన్న అక్కసుతో... బీసి నాయకత్వాన్నే అణిచేస్తారా..? దీనికి ఇంతకు ఇంత  మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ దుశ్చర్యలను తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలుగుదేశం బీసీ నేతలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వారిపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పై అన్నివిధాలా పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.