Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య వెనుక వైఎస్ భారతి బంధువులు... ఆ ముగ్గురిపనే: చంద్రబాబు సంచలనం

ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతి తండ్రి హస్తముందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.  

TDP Chief Chandrababu Sensational Comments on YS Vivek Murder Case
Author
Amaravathi, First Published Mar 14, 2020, 9:00 PM IST

గుంటూరు: మాజీ మంత్రి, స్వయానా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కి బాబాయ్ అయిన వివేకానంద రెడ్డిని అతి దారుణంగా హత్యచేశారని... తలలో మెదడు బైటకొచ్చేదాకా నరికారని మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ హత్య చేసింది జగన్ కు పిల్లనిచ్చిన మామ గంగిరెడ్డేనని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. హత్య తర్వాత అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి లు కలిసి సాక్ష్యాలు రూపూమాపాలని ప్రయత్నించారని... అయితే తండ్రి శరీరంపై గాయాలను చూసిన వివేకా కూతురు ఇది హత్య అని సహజ మరణం కాదని బైటపెట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. 

జగన్ భార్య వైఎస్ భారతి తండ్రి, మేనమామే ఈ హత్య చేశారని ప్రపంచమంతటికి తెలుసన్నారు. ఈ హత్యలో అందరూ ఇంటిదొంగలే పాల్గొన్నారని అన్నారు. చివరకు వివేకానందరెడ్డి కూతురు పోరాడి ఈ కేసును సీబీఐ విచారణకు ఇప్పించిందన్నారు. 

read more  పోలీస్ టెర్రరిజం... ఖాకీ డ్రెస్ విప్పి వైసిపి దుస్తులోకి మారండి: చంద్రబాబు ఫైర్

''నేను విశాఖలో పర్యటనకు  అనుమతి తీసుకుని వెళ్తే మాజీ ముఖ్యమంత్రినని కూడా చూడకుండా 151కింద నన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పమన్నాను. ఏ రూల్ కింద, ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారో లిఖితపూర్వకంగా తెలియచేయాలన్నాను. పోలీస్ స్టేషన్ కైనా, జైలుకైనా వస్తాను అని చెప్పాను. అవేవీ పట్టించుకోకుండా 151కింద నోటీస్ ఇచ్చారని.. చివరకు దీనిపై కోర్టులో ఏమైందో చూశారుగా? డీజీపీ 5.40 నిమిషాల వరకు నిలబడే పరిస్థితి'' అని అన్నారు. 

''మాచర్లలో పట్టపగలు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు,  ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, న్యాయవాది కిశోర్ లపై హత్యాయత్నం చేశారు.  వాళ్లు ఇప్పుడంటున్నారు... మాచర్లలో స్కెచ్ వేస్తే ఇంతవరకూ ఎవరూ తప్పించుకోలేదంట...వీళ్లు తప్పించుకున్నారట'' అని మాచర్ల ఘటన తర్వాత వైసిపి మళ్లీ బెదిరించినట్లు చంద్రబాబు తెలిపారు.

''ఇంకో ఘటన తెనాలిలో జరిగింది. తెనాలిలో టిడిపి అభ్యర్ధి ఇంటి గోడదూకి అర్ధరాత్రి వేళ బిల్డింగ్ పైకెక్కి, వాటర్ ట్యాంక్ పక్క మద్యం సీసాలు పెట్టి, తప్పుడు కేసు పెట్టారు. ఎవడి ఇంట్లోకి ఎవడైనా రావచ్చా.. ఏమైనా చేయొచ్చా.. ఆ ఇంటిలో సీసీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి బతికిపోయారు. అదే సీసీకెమెరా లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి? అన్ని కేసులు ఇదేమాదిరి పెడుతున్నారు'' అని ఆరోపించారు. 

''రేపు ఏ ఇంట్లోకి అయినా ఇలాగే వెళ్లి హత్యలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, లూఠీలు చేయొచ్చు. దానికి సమాధానం ఏముంది?  ఎవరైతే వివేకానందరెడ్డిని చంపారో వారిపై కేసులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 40ఏళ్ల రాజకీయ అనుభవమున్ననన్ను చట్టపరంగా నిలువరించే ప్రయత్నం చేశారు'' ఇలా వైసిపి అరాచకాలకు పాల్పడుతోందంటూ చంద్రబాబు వెల్లడించారు. 

read more   అందుకే మేం ఓడాం, జగన్ గెలిచాడు: ఇన్నాళ్లకు కారణం చెప్పిన పవన్ కల్యాణ్

''మామూలుగా వీళ్లు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆధార్ నంబరుంటేనే లిక్కర్ అమ్ముతారు. దానికి కూడా బార్ కోడింగ్, హాలోగ్రామ్ ఉంటుంది. ఏ షాపు నుంచి ఎక్కడికి వెళ్లిందో..ఎవరుకొన్నారో తెలుస్తుంది. నిన్న తెనాలిలో ఇంట్లో పెట్టిన మద్యం వారి షాపు నుంచే వచ్చిందని తెలిసింది. ఇలాంటి తప్పుడు కేసులు కాళహస్తిలో పెట్టారు. రేపల్లెలో పెట్టారు. నిన్న చిలకలూరిపేటలో పెట్టారు. ఎక్కడైనా లిక్కర్ గానీ దొరికితే ఆ లిక్కర్ ఎవరు కొన్నారో తెలిసే మెకానిజం ఉంది.  అయినా పోలీసులు ఏం చేశారు?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios