జనసేన పార్టీ 6వ ఆవిర్భావసభ నేడు రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన ముఖ్యనాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావసభలో ... జనసేన పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. సమాజంలో పిరికితనం ఎక్కువైపోయిందని, ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి అనుక్షణం కృషి చేస్తానని అన్నారు. 

ఇక తాను రాజకీయాల్లో వచ్చిన వెంటనే గెలిచి పదవులు పొందడానికి రాలేదని. లాంగ్ టర్మ్ గోల్స్ తో, దూర దృష్టితో సమాజానికి మంచి చేయడానికి వచ్చానని అన్నారు పవన్.ప్రస్తుత రాజకీయాలపై కొన్ని కీలక కామెంట్స్ చేసాడు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో హింసాపూరిత రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. 

తాను ఇదే రాజమండ్రిలో భారీ కవాతు నిర్వహిస్తే 7 లక్షల మంది దాకా తన వెంట నడిచి వస్తే... మరో మూడు లక్షల మంది చుట్టుపక్కల చిక్కుకుపోయారని ఆయన అన్నారు. ఇంత మంది తన వెంట నడిస్తే అందులో ఎవరు కూడా ఎన్నికల్లో ఓట్లు మాత్రం తమ పార్టీకి వేయలేదని.... హింసాత్మక రాజకీయాలనే ఎన్నుకున్నారని అన్నారు. 

అలా క్రిమినల్స్ ని ఎన్నుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారని, ఓట్లు వేసిన ప్రజలదే తప్పని, రాష్ట్రంలో ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అధికార పార్టీ వారందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ప్రజలదే తప్పని, వారే తమ స్వహస్తాలతో క్రిమినల్స్ ని ఎన్నుకున్నారని అన్నారు. ఓట్లేసిన ప్రజలదే తప్పు కానీ జనసేర్ణ వారికి ఏ సంబంధము లేదని అన్నాడు. 

ఇక ఇదే సభలో మాట్లాడుతూ... దిశా ఉదంతంపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్.  వైద్యురాలు దిశ రేప్, హత్య కేసులో నిందితులు రౌడీలు కాబట్టి వారిని కాల్చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

రెసిడెన్షియల్ స్కూల్ కు వెళ్లి రేప్ చేసేవారిని ఏం చేయాలని ఆయన సుగాలీ ప్రీతి కేసును ఉద్దేశించి అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటైన సభలో ఆయన శనివారంనాడు ప్రసంగించారు. రెసిడెన్షియల్ స్కూల్ కు వెళ్లి రేప్ చేస్తే ఎవరూ మాట్లాడరని, ఆధారాలున్నా చర్యలు తీసుకోరని ఆయన అన్నారు 

Also read: జగన్ హిట్లర్ కన్నా గొప్పవాడా...? వైసీపీకి నాగబాబు పంచ్

సుగాలీ ప్రీతి తల్లి నిస్సహాయత చూస్తే గుండె చలించిందని, అటువంటి నిస్సహాయులకు అండగా నిలబడాలనేది తన ఉద్దేశమని ఆయన అన్నారు. పిరికివాడిగా తాను బతకలేనని ఆయన అన్నారు.

ప్రజలు తనను వదిలినా తాను ప్రజలను వదలబోనని ఆయన అన్నారు. వ్యవస్థలో మార్పు రావాలని ఆయన అన్నారు. తాను మాట్లాడబట్టే సుగాలీ ప్రీతి కేసు సిబీఐ దాకా వెళ్లిందని ఆయన చెప్పారు.  

జనసేన లేకపోతే ఆ ఆ కేసు బయటకు రాదని, వందలాది జరుగుతున్నా ఒక్క కేసు ఎందుకు పట్టుకుంటామంటే స్ఫూర్తి రావాలని అని ఆయన అన్నారు. అటువంటి నేరాలు చేసేవారిలో భయం పుట్టాలని ఆయన అన్నారు. తనకు ఓటువేసినా వేయకపోయినా యువతలో అగ్ని ఉందని, న్యాయం జరగాలనే తపన ఉందని ఆయన అన్నారు. యువతలో అగ్ని ఉంది కాబట్టే అనంతపురంలో తన కార్యక్రమానికి 30 వేల మందికి పైగా వచ్చారని ఆయన చెప్పారు. 

తాను వెళ్లబట్టే గత్యంతరం లేక రాష్ట్ర ప్రభుత్వం సుగాలీ ప్రీతి కేసును సిబీఐకి అప్పగించిందని ఆయన అన్నారు. ప్రజలను ఉత్తేజపరిచి ఏకతాటిపైకి తెచ్చే శక్తి జనసేనకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు ఏవైనా వాటి పరిష్కారానికి తాను ప్రజల వెంట ఉంటానని ఆయన చెప్పారు.