గుంటూరు: సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గత శుక్రవారం ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో మళ్లీ ఉద్యమం ఉదృతమయ్యింది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగాలని కోరుతూ సాగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న రైతు నన్నపనేని వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. ఈ మృతిపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పందించారు.  

''ముందురోజు వరకు కూడా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్న రాజధాని రైతు.. నన్నపనేని వెంకటేశ్వరరావుగారు తెల్లారేసరికి గుండెపోటుతో మరణించడం బాధాకరం. రాజధాని కోసం 4 ఎకరాలిచ్చిన రైతు కుటుంబానికి ఈ ప్రభుత్వం తీరని శోకాన్ని బదులిచ్చింది'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

read more   చిచ్చు పెట్టిన పవన్: వల్లభనేని వంశీ రాజీనామా సరిపోదన్న బుద్ధా వెంకన్న

''ఈ ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహానికి ఇప్పటికే 65 మంది రాజధాని రైతులు, రైతుకూలీలు ప్రాణాలిచ్చారు. ఇంకా ఎంతమంది రైతులు బలికావాలి? ఇన్ని కుటుంబాలు ఇక్కడ గుండెలు పగిలే బాధల్లో ఉంటే కనీసం వచ్చి ఓదార్చే తీరికలేదా ఈ పాలకులకి?'' అంటూ ట్విట్టర్ ద్వారా వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. 

సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గత శుక్రవారం ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి అడ్డంకులు తొలిగాయి. దీంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.