అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు  గురువారం నాడు ఫోన్ చేశారు. పుట్టిన రోజును పురస్కరించుకొని ఫోన్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 22వ తేదీ అమిత్ షా పుట్టిన రోజు.

చాలా రోజుల తర్వాత చంద్రబాబునాయుడు అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ  సందర్భంగా రాజకీయపరమైన చర్చలు జరిగాయా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

పుట్టిన రోజు శుభాకాంక్షలకు మాత్రమే సంభాషణ పరిమితమై ఉందా... ఇతరత్రా విషయాలపై చర్చ జరిగిందా అనేది తెలియదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కొంత కాలంగా బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కూడ చంద్రబాబు ఫోన్ చేశారు. గోయల్ కు అనారోగ్యంగా ఉండడంతో ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు.  గోయల్ త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

అమిత్ షా పుట్టిన రోజును పురస్కరించుకొని పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ ఫోన్ చేసి శుభాకాంక్షలు చేశారని చెబుతున్నారు.