పద్దతి మార్చుకోకపోతే నేనే మార్చేస్తా: కర్నూల్ నేతలకు బాబు సీరియస్ వార్నింగ్

Tdp chief Chandrababu Naidu warns to Kurnool leaders
Highlights

కర్నూల్ నేతలకు బాబు క్లాస్


కర్నూల్: తమ మధ్య ఉన్న విబేధాలను వీడి పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని  టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏనీ సీఎం చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా నేతలకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాల్సిందిగా కోరారు.   పార్టీకి నష్టం కల్గించేలా వ్యవహరిస్తున్న నేతలపై బాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పద్దతిని మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.

కర్నూల్ జిల్లాలోని పార్టీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో  పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. 

జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పార్టీ నేతలంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నారని బాబు పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.జిల్లాలోని కర్నూల్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

తొలుత కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని  కర్నూల్, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు  అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలతో బాబు సమావేశమయ్యారు. ఆ తర్వాత నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గనేతలతో ఆయన సమావేశమయ్యారు. 

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనమే గెలవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పటికైనా కొందరు తమ పద్దతులను మార్చుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే  వారిని వదులుకొనేందుకు కూడ తాము సిద్దమేనని ఆయన చెప్పారు. కర్నూల్, కోడుమూరు,పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల తీరును బాబు తప్పుబట్టారు.  ఇంచార్జీలుగా ఉన్నవారంతా  అందరిని కలుపుకుపోవాలని బాబు  ఆదేశించారు.

కర్నూల్ పార్లమెంట్ స్థానంలో  పార్టీని బలోపేతం చేసే బాధ్యతను  ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్,  ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌లకు చంద్రబాబు అప్పగించారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో  పర్యటించాలని ఆయన సూచించారు.  నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి  వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపాలనే విషయమై కూడ నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నేతల సమావేశంలో చంద్రబాబునాయుడు చర్చించారని సమాచారం.

నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఎంపీగా పోటీకి పెడితే ఎలా ఉంటుందని ఆ సెగ్మెంట్‌ పరిధిలోని ముఖ్య నాయకులతో చర్చించినట్లు తెలిసింది. మాండ్రకు టికెట్‌ ఇస్తే ఆయన సమీప బంధువు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందా అనే విషయమై కూడ బాబు   ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు ఆయన అల్లుడు కూడ ఈ టిక్కెట్టును ఆశిస్తున్నారు.అయితే ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే  పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయమై బాబు నేతలతో చర్చించారని సమాచారం.

loader