వైసీసీ రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.  వైసీపీ రౌడీలు నేరుగా తనతో తలపడలేక పోలీసులను నేరాల్లో భాగస్వాముల్ని చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీసీ రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లను సందర్శిస్తున్న ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల సైకో ఓడిపోతారని జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే గిద్దలూరుకు వద్దామనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి వస్తే తిరుగు టపాలో పంపాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని.. ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి వుంటే ఈ పరిస్థితి వుండేది కాదన్నారు. 

తాను విమర్శలు గుప్పించడంతో జగన్ ఇప్పుడు వరద బాధితుల పరామర్శకు బయల్దేరారని చంద్రబాబు చురకలంటించారు. జగన్ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ అని.. పేదవాడి పక్షాన నిలబడి వారిని ధనవంతులను చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ చూసిన తర్వాత వైసీపీకి ఎవరూ ఓటేయ్యరని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ రౌడీలు నేరుగా తనతో తలపడలేక పోలీసులను నేరాల్లో భాగస్వాముల్ని చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: పుంగనూర్ ఘటనపై మూడు కేసులు నమోదు.. 50 మంది అరెస్ట్!!

కాగా. చంద్రబాబు నాయుడు శుక్రవారం పుంగనూరులో పర్యటించిన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పలు పోలీసు స్టేషన్‌లలో ఉంచి విచారిస్తున్నట్టుగా సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన రూట్‌ను టీడీపీ మార్చిందని.. ఆయన కాన్వాయ్‌ పుంగనూరు బైపాస్‌కు చేరుకునేలోపే పార్టీ స్థానిక ఇన్‌చార్జి హఠాత్తుగా మద్దతుదారులను సమీకరించారని చెప్పారు.

టీడీపీ మద్దతుదారులు దూకుడుగా ముందుకు వచ్చారని.. పోలీసు అధికారులపై కర్రలు, బీరు సీసాలు, పెద్ద రాళ్లతో దాడి చేశారని చెప్పారు. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 40 మంది అధికారులకు గాయాలయ్యాయని చెప్పారు. రెండు పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారని తెలిపారు. పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మూడు కేసులు పెట్టామని వెల్లడించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు.