Asianet News TeluguAsianet News Telugu

పుంగనూర్ ఘటనపై మూడు కేసులు నమోదు.. 50 మంది అరెస్ట్!!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పుంగనూరులో పర్యటించిన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

50 arrested in connection with violence that erupted during Chandrababu punganur visit ksm
Author
First Published Aug 6, 2023, 8:26 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పుంగనూరులో పర్యటించిన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని పలు పోలీసు స్టేషన్‌లలో ఉంచి విచారిస్తున్నట్టుగా సమాచారం. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన రూట్‌ను టీడీపీ మార్చిందని.. ఆయన కాన్వాయ్‌ పుంగనూరు బైపాస్‌కు చేరుకునేలోపే పార్టీ స్థానిక ఇన్‌చార్జి హఠాత్తుగా మద్దతుదారులను సమీకరించారని చెప్పారు.

టీడీపీ మద్దతుదారులు దూకుడుగా ముందుకు వచ్చారని..  పోలీసు అధికారులపై కర్రలు, బీరు సీసాలు, పెద్ద రాళ్లతో దాడి చేశారని చెప్పారు. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 40 మంది అధికారులకు గాయాలయ్యాయని చెప్పారు. రెండు పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారని తెలిపారు. పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి మూడు కేసులు పెట్టామని వెల్లడించారు. పోలీసులపై దాడులకు పాల్పడిన వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ‘‘చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారని.. పోలీసుల వాహనాలతో సహా ఐదు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసు సిబ్బందిలో బందోబస్త్‌ను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ కూడా ఉన్నారు. గాయపడిన అధికారులను ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొందరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు’’ అని  డీజీపీ తెలిపారు. పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని.. హింసలో పాల్గొన్న వారందరినీ గుర్తించారని చెప్పారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిందితులందరినీ గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించడంపై దృష్టి సారించామని చెప్పారు.

ఇక, చిత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అనంతపురం డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిగా కనిపిస్తోందని అన్నారు. నాయుడు ర్యాలీకి పుంగనూరులో ప్రవేశించడానికి అనుమతి లేదని, తెలుగుదేశం క్యాడర్ రూట్ మార్చే వరకు పరిస్థితి ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఘర్షణకు దారితీసిందని ఆయన వెల్లడించారు.

బందోబస్తు కోసం దాదాపు 400 మంది సిబ్బందిని నియమించినట్టుగా చెప్పారు. అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బైపాస్ మార్గంలో కాకుండా పుంగనూరు పట్టణం వైపు దారి మళ్లించే ప్రయత్నం చేశారని.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగి రాళ్లు, బీరు బాటిళ్లపై దాడి చేశారని తెలిపారు. 

ఇక, విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గుంపును నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు బలవంతంగా లాఠీచార్జి చేశారని చెప్పారు. అయితే వారిపై కూడా దౌర్జన్యం చేశారని.. దీంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయని చెప్పారు. 11 మంది పోలీసులకు తీవ్రగాయాలు కాగా, మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios