అటు కరోనా, ఇటు వరదలు, మరోవైపు వైసిపి నిర్లక్ష్యంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆరోపించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాటర్ మేనేజిమెంట్ లో వైసిపి ప్రభుత్వం విఫలమైందని బాబు ఆరోపించారు.కేంద్ర జలసంఘం హెచ్చరికలను బేఖాతరు చేసిందని, వరద బాధితులపై రాజకీయ వివక్ష చూపడం హేయమని ఆయన ధ్వజమెత్తారు.

బాధితుల్లో రాజకీయాలు చూడటం ఎక్కడైనా ఉందా, ప్రభుత్వ పరిహారం అందించడంలో పార్టీలను చూస్తారా... అని చంద్రబాబు నిలదీశారు. తిత్లిలో నిరాశ్రయులకు రోజుకు 1,35,650మందికి భోజనాలు పెట్టామని...10రోజుల్లో 13లక్షల మందికి భోజనాలు వండించి అందజేశామని గుర్తుచేశారు.

ప్రస్తుత వైసిపి ప్రభుత్వంలో ఆ స్ఫూర్తి కొరవడటం బాధాకరమని.. పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలా ఆదుకోవాలి ఆయన డిమాండ్ చేశారు. 100% సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందజేయాలన్న ఆయన... వరద బాధితులను ఆదుకున్న టిడిపి నాయకులను అభినందించారు.

విపత్తు బాధితులను ఆదుకోవడం ఎన్టీఆర్ నేర్పిన సుగుణమన్న చంద్రబాబు... అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తెలుగుదేశం ఉంటుందని స్పష్టం చేశారు.

బాధితులకు అండగా ఉండటం తెలుగుదేశం సామాజిక బాధ్యతని... ప్రతి విపత్తులోనూ మానవతా దృక్పథంతో టిడిపి ప్రభుత్వం ఆదుకుందని వెల్లడించారు. వైసిపి ప్రభుత్వం ఇప్పుడు పైశాచిక ఆనందంతో వ్యవహరిస్తోందని... వైసిపి నోటి మాటలే తప్ప. చేతలతో ఆదుకుంది లేదని చంద్రబాబు  ఆరోపించారు.

టిడిపి ప్రభుత్వం అందించిన దానికన్నా ఎక్కువ పరిహారం అందించాలని కోరారు. హుద్ హుద్, తిత్లిలో ఇచ్చినదాని కన్నా అధిక పరిహారం అందించి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.