ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబుకు అస్వస్థత .. రాజమండ్రి జైలుకు వైద్య బృందం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురయ్యారు. ఆయన అలర్జీతో బాధపడుతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబు అలర్జీ బారినపడినట్లుగా సమాచారం. దీనిపై స్పందించిన జైలు అధికారులు వెంటనే.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించారు. దీంతో వైద్య బృందం హుటాహుటిన జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడును పరీక్షించారు.
ఇకపోతే.. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్‌ను ఏసీబీ కోర్టు గురువారం నాడు ఆమోదించింది. ఈ నెల 16న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరు పర్చాలని జడ్జి ఆదేశించారు. సోమవారం నాడు ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటలలోపు కోర్టు ముందు చంద్రబాబును ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఆదేశించింది ఏసీబీ కోర్టు. రేపు చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పులు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది.
Also Read: అంగళ్లు కేసు..చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
ఏపీ ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్‌లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఫైనల్‌గా మీ వాదనలు వినిపించాలని న్యాయవాదులకు జడ్జి సూచించారు. చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు. సిఐడి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదించారు. ఈరోజు వాదనలు పూర్తి చేస్తే నిర్ణయం చెబుతానన్న న్యాయమూర్తి ప్రకటించారు. సుప్రీంకోర్టులో రేపు క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. దీంతో తీర్పును రేపటికి వాయిదా వేయాలని ఏసీబీ కోర్టు జడ్జిని చంద్రబాబు లాయర్లు కోరారు.