ప్రజల ఆస్తులు దోచేందుకు సీఎం జగన్‌ భూముల రీసర్వే ప్రారంభించారని విమర్శించారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. మంగళవారం పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. చుక్కల, అసైన్డ్‌, సొసైటీ.. ఇలా 6 రకాల భూములపై జగన్ కన్నుపడిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే హడావుడిగా భూముల రీసర్వే ప్రారంభించారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రజలంతా ఏరోజుకారోజు భూములను సరిచూసుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ల్యాండ్‌ మాఫియా పేట్రేగిపోతోందని టీడీపీ చీఫ్ ఆరోపించారు.

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలోనూ వందల కోట్ల భూకుంభకోణాలు జరిగాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజల్ని వేధించడం, దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించడమే వైసీపీ అజెండా అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు.

పంచ భూతాలనూ వైసీపీ నేతలు మింగేస్తున్నారని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చివరికి జగన్‌ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో శ్రమించిన సొంత పార్టీ కార్యకర్తలనూ సైతం వైసీపీ నేతలు వదలడం లేదని ఆయన ఆరోపించారు.

భట్టిప్రోలులో వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, తాడేపల్లి కార్యకర్త సెల్ఫీ వీడియోలే దీనికి నిదర్శనమన్నారు. ఉచితంగా అందే ఇసుకకు ధర పెట్టి నిలువు దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచకాలకు బలైన వారికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.