రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఇతర దారుణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నేరస్తులను వెనకేసుకొచ్చేలా సీఎం చర్యలు వున్నాయని ఆయన ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఇతర దారుణాలపై ఆయన ఆదివారం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని.. ప్రజల ఆస్తులకు రక్షణ లేదన్నారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి, గన్ కల్చర్ పెరుగుతున్నాయని.. విశాఖలో ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. నేరస్తులను వెనకేసుకొచ్చేలా సీఎం జగన్ వైఖరి వుందని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇదిలావుండగా.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. కొడాలి నాని బ్రతుకే లాలూచీ బ్రతుకని విమర్శించారు. నోటికొచ్చిన అబద్దాలు చెప్పే కొడలినాని అన్నం తింటున్నాడా గుట్కాలు తింటున్నాడా? అంటూ ప్రశ్నించారు. గుడివాడలో కొడాని నాని చేసిన భూ కుంభకోణంపై తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు. కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. మరో ఆరు నెలల్లో కొడాలి నానికి దబిడి.. దిబిడే అంటూ హెచ్చరించారు.
Also Read: కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ.. జగన్ నుంచి వారికి ప్రాణహాని: బుద్దా వెంకన్న సంచలనం
గుడివాడ ప్రజలు కొడాలినానికి ఎప్పుడో గోరీ కట్టారని.. అయితే ఒళ్లు కొవ్వెక్కి దిగిన బుల్లెట్ తెలియట్లేదంతే అంటూ బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. 2005లో రాజశేఖర్‌రెడ్డి కొడాలి నానికి ఉపయోగపడితే.. 2009లో టికెట్ కోసం చంద్రబాబు నాయుడును ఎందుకు అడిగాడని ప్రశ్నించారు. గుడివాడ ప్రజలకు రాజశేఖరరెడ్డి మంచి చేసి ఉంటే.. 2009లో అక్కడివారు టీడీపీని ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు. కొడాలి నానికి నిజం మాట్లాడితే తల పగులుతుందనే శాపం ఉందేమోనని ఎద్దేవా చేశారు.
