ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫానును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కరువులు, తుపానులు వస్తే ఏం చేయాలో ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదన్నారు.
ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫానును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తుపాను లాంటివి వచ్చినప్పుడు దానిని ఆపలేకపోయినా , కలిగే నష్టాన్ని నియంత్రించగలమన్నారు. పోలవరం పూర్తయితే గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు వస్తాయని, అక్కడ ఎప్పుడూ నీళ్లు త్వరగా వస్తాయని చంద్రబాబు తెలిపారు.
నవంబర్ , డిసెంబర్ నెలల్లో తుపానులు ఎక్కువగా వస్తాయని.. పట్టిసీమ ద్వారా సకాలంలో సాగునీరు అందిస్తే, నవంబర్ కంటే ముందే పంట చేతికొస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. పులిచింతల జలాలను అత్యవసర పరిస్ధితుల్లో తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించాలని చంద్రబాబు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కరువు కారణంగా 26 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేకపోయారని టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి పంటను వేసినప్పటికీ వర్షాలు లేక, దిగుబడి రాక దిగుబడి సరిగా రాలేదన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లను వైసీపీ ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్ధితి వచ్చిందని.. పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మత్తుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకనే వారు ఆసక్తి చూపలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లోని 22 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని.. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు భరోసా కల్పించాలని, పంట నష్టం ఎంతో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. జాతీయ విపత్తులు వచ్చినప్పుడు కేంద్రాన్ని అప్రమత్తం చేయాలని, చివరికి తాను లేఖ రాయాల్సి వచ్చిందన్నారు. కరువులు, తుపానులు వస్తే ఏం చేయాలో ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదన్నారు. తుపాను బాధితులను కార్పెట్ వేసుకుని పరామర్శిస్తున్నారని , ఆయనేమైనా కార్పెట్‌లో పుట్టాడా అంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. చివరికి ఆలుగడ్డకు, ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం వుండటం మన దౌర్భాగ్యమన్నారు. ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, 24 శాతం నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ నెంబర్‌వన్‌గా వుందన్నారు.
