సీనియర్ నాయకులతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశాలయాలపై దాడులు జరగని రోజే లేదని విమర్శించారు.

ఇంత జరుగుతున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. దాడి జరిగిన ఏ ఒక్క ఆలయ ప్రాంతమైనా సీఎం జగన్ సందర్శించారా అని చంద్రబాబు నిలదీశారు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు ఓట్ల కోసం హిందూమతం స్వీకరించినట్లు డ్రామాలాడి.. గెలిచాక బైబిల్ పెట్టుకుని ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప,  ఏ మతంపైనా జగన్ కు విశ్వాసం లేదన్నారు.

రాజధాని అమరావతిపై, ఫైబర్ గ్రిడ్ పై వైసిపి దుష్ప్రచారం చేస్తోందని.. రూ770కోట్లు ఖర్చు చేసిన ఫైబర్ గ్రిడ్ లో రూ2వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

ప్రత్యేక హోదాపై, విభజన చట్టంలో అంశాలపై వైసిపి ఎంపిలు ప్రశ్నించరని ఆయన దుయ్యబట్టారు. సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి జయరామ్ పై చర్యలు లేవని బాబు ఎద్దేవా చేశారు.

ప్రలోభాలు పెట్టి కొందరిని లాక్కున్నంత మాత్రాన టిడిపికి నష్టం ఏమీలేదని.. ఒకరు పోతే వందమందిని తయారుచేసే సత్తా తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. నాపై గతంలో 26 విచారణలు చేయించారని.. 14సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 జ్యుడిషియల్ ఎంక్వైరీలు, 1 సిబిసిఐడి జరిగినా, ఎవరూ ఏదీ రుజువు చేయలేకపోయారని చంద్రబాబు గుర్తుచేశారు.

సమాజంలో ఎవరే తప్పు చేసినా కరెక్ట్ చేసేది న్యాయస్థానాలేనని... అలాంటి పవిత్ర న్యాయమూర్తులపై, కోర్టులపై వైసిపి బురద జల్లడం హేయమన్నారు. రైతుల పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటును ప్రతిఘటించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.