Asianet News TeluguAsianet News Telugu

జాకెట్లలో దాచుకున్నా లాక్కుంటున్నారు: స్థానిక ఎన్నికల తీరుపై బాబు వ్యాఖ్యలు

ఆడపిల్లలు నామినేషన్ పేపర్లను జాకెట్లలో దాచుకుని వెళితే.. వారి  లో దుస్తుల్లో చేయిపెట్టి మరీ లాక్కుంటున్నారని ముఖ్యమంత్రి జగన్‌పై ముందు దిశ చట్టం పెట్టాలని బాబు మండిపడ్డారు. 

tdp chief chandrababu naidu sensational comments on ap cm ys jagan mohan reddy
Author
Mangalagiri, First Published Mar 13, 2020, 7:13 PM IST

ఆడపిల్లలు నామినేషన్ పేపర్లను జాకెట్లలో దాచుకుని వెళితే.. వారి  లో దుస్తుల్లో చేయిపెట్టి మరీ లాక్కుంటున్నారని ముఖ్యమంత్రి జగన్‌పై ముందు దిశ చట్టం పెట్టాలని బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం కోసం వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తారని బాబు మండిపడ్డారు.

పోలీసులు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలకు భయపడి ప్రజలు దొంగతనంగా తిరగాల్సిన పరిస్ధితి వచ్చిందని, గోడ దూకి జనాల ఇళ్లలోకి రారని గ్యారెంటీ ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు..

Also Read:వైసీపీ ఖాతాలోకి మాచర్ల మున్సిపాలిటీ: 31 వార్డులూ ఫ్యాన్ గుప్పిట్లోకే

రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి పట్టదా, హోంమంత్రికి పట్టదా అని ఎన్నికలను నిర్వహించే పద్దతి ఇదేనా అని ఆయన ఎన్నికల కమీషన్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, లాయర్ కిశోర్‌పై మాచర్లలో హత్యాయత్నం చేసిన ఘటనపై ఐజీ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు మండిపడ్డారు.

డోన్ ఎగురవేశారని ప్రశ్నించినందుకు ఎనిమిది రోజులు జైళ్లో పెట్టారని, ఎంపీ నందిగం సురేశ్‌ను అడ్డగించారని 14 రోజులు జైల్లో పెట్టారని అదే సమయంలో మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి అలా జైలుకు వెళ్లి ఇలా బయటకు వచ్చేశారని టీడీపీ అధినేత చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ దాడులపై 38 ఫిర్యాదులు ఇచ్చామని కానీ వీటిపై స్పందించిన దాఖలాలు లేవన్నారు. పేదల అసైన్డ్‌ భూములను లాక్కోవడానికి జగన్ ప్రభుత్వం పోలీసులను పంపిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయని హైకోర్టు చురకలు వేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

బందిపోట్లకు, గుండాలకు మాచర్ల స్థావరమా అని ఆయన ప్రశ్నించారు. ఎవరైనా అక్కడికి వస్తే ఇదే గతి పడుతుందని, తిరిగి వెళ్లలేరని మాచర్ల ఎమ్మెల్యే కండకావరంతో మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు. దౌర్జన్యాలు ఎంతోకాలం సాగవని, బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు.

మాచర్లలో చివరి రోజు కూడా ఒక్క వార్డుకు సైతం నామినేషన్ వేయలేకపోయామని ఎన్నికల కమీషన్ దీనిపై ఆలోచించలేదా అని బాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పోటీ చేసే వాళ్లు లేరంటే అది ఆయనకు సిగ్గు చేటన్నారు.

Also Read:ఏపీలో వైసీపీ నేతల దాడులు: అమిత్ షా జీ... జోక్యం చేసుకోండి, బీజేపీ ఎంపీల ఫిర్యాదు

స్థానిక ఎన్నికల్లో 90 శాతం విజయం సాధించకపోతే నేరుగా గవర్నర్‌ను కలిసి రాజీనామా చేయాలని మంత్రులను జగన్ హెచ్చరించారని బాబు గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

వైసీపీ నేతల బెదిరింపులపై చివరికి బీజేపీ నేతలు సైతం కేంద్రానికి ఫిర్యాదు చేశారని బాబు గుర్తుచేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వైరస్ అంతకంటే ప్రమాదకరమైనదని ఆయన వ్యాఖ్యానించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios