ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాజ్యసభ్య సభ్యులు జీవీఎల్ నరసింహారవు, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్‌లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరిగాయని వారు లేఖలో వివరించారు. పోలీసులు, వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎంపీలు ఆరోపించారు. పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని వారు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు.

Also Read:ఇదేం విచిత్రం.. కలిసి పోటీ చేస్తున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు

నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల బీజేపీ, జనసేన కార్యకర్తలపై దాడులు జరిగాయని అధికార వైసీపీ నేతలు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, పోలీసులు కూడా కేవలం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ... శుక్రవారం ఉదయం అమిత్ షా దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరిగా స్పందించడం లేదని జీవీఎల్ మండిపడ్డారు. నామినేషన్ వేసిన బీజేపీ, జనసేన కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చి వారిని విత్ డ్రా చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని జీవీఎల్ స్పష్టం చేశారు.

Also Read:వీసా తీసుకోవాలా, జగన్ పులివెందుల్లోనే ఉండాలి: చంద్రబాబు

మరో ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ... ప్రతీకారం తీర్చుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.