మూడేళ్లుగా రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆ రోజు ఊరూరా తిరిగి ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు అంటూ ఆయన సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇంటికి ఒకరు రావాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.
మదనపల్లెలో (madanapalle) జరిగిన ఎన్టీఆర్ స్పూర్తి చంద్రన్న భరోసా పేరుతో బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై (ys jagan) విరుచుకుపడ్డారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu). ఆ రోజు ఊరూరా తిరిగి ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు అంటూ సెటైర్లు వేశారు. అమ్మఒడికి ఆంక్షలు పెట్టి మోసం చేశారని.. మూడేళ్లుగా రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలేనని ఆయన దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
తాము కన్నెర్ర చేస్తే వైసీపీ నేతలు బయట తిరగలేరని టీడీపీ చీఫ్ హెచ్చరించారు. అప్పుడు తాము అధికారంలో వున్నప్పుడు అనుకుని వుంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలో ప్రతి గ్రామంలో పాఠశాలలు కట్టించామని.. పేదలు బాగా చదువుకోవాలని తాము కోరుకున్నామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్నింటిపై బాదుడే బాదుడుకు దిగిందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ సొంత డిస్టిలరీలు పెట్టుకుని... మద్యం ధరలు పెంచారని ఆయన ఆరోపించారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పారని.. నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇంటికి ఒకరు రావాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.
ALso Read:రైలు బోగిని తగలబెట్టి... ఎంపీ రఘురామను హత్య చేయాలని చూశారు: టీడీపీ నేత బొండా ఉమ
అంతకుముందు సోమవారం తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును హత్యకు కుట్ర పొందారని ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడటానికి సీఎం జగన్ అన్నిరకాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అల్లూరి జయంతి ఉత్సవాలకు స్థానిక ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు రాకుండా అన్నిరకాల అడ్డంకులు సృష్టించారని అన్నారు.
హైదరాబాద్‌లో రఘురామ చుట్టూ ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ అధికారులను ఎందుకు నిఘా ఉంచారని ప్రశ్నించారు. రఘురామ కృష్ణరాజు హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ఉంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని అన్నారు. సత్తెనపల్లిలో ఆయనను హత్య చేసేందుకు పక్కా ప్రణాళికను తాడేపల్లి నుంచి రూపొందించారని ఆరోపించారు. రఘురామ ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారని అన్నారు. అయితే లింగపల్లిలో రైలు ఎక్కిన రఘురామ కృష్ణరాజుకు బేగంపేటకు వచ్చే సరికి దాడి గురించి సమాచారం తెలియగానే దిగిపోయి.. ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు. లేకపోతే ఇప్పటికే జే గ్యాంగ్ చేతిలో ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు.
