తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును హత్యకు కుట్ర పొందారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును హత్యకు కుట్ర పొందారని ఆరోపించారు. సొంత పార్టీ ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడటానికి సీఎం జగన్ అన్నిరకాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అల్లూరి జయంతి ఉత్సవాలకు స్థానిక ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు రాకుండా అన్నిరకాల అడ్డంకులు సృష్టించారని అన్నారు. 

హైదరాబాద్‌లో రఘురామ చుట్టూ ఆంధ్రప్రదేశ్ సీబీ సీఐడీ అధికారులను ఎందుకు నిఘా ఉంచారని ప్రశ్నించారు. రఘురామ కృష్ణరాజు హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ఉంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని అన్నారు. సత్తెనపల్లిలో ఆయనను హత్య చేసేందుకు పక్కా ప్రణాళికను తాడేపల్లి నుంచి రూపొందించారని ఆరోపించారు. రఘురామ ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారని అన్నారు. అయితే లింగపల్లిలో రైలు ఎక్కిన రఘురామ కృష్ణరాజుకు బేగంపేటకు వచ్చే సరికి దాడి గురించి సమాచారం తెలియగానే దిగిపోయి.. ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు. లేకపోతే ఇప్పటికే జే గ్యాంగ్ చేతిలో ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. 

తాము చెబుతున్న విషయాలు వాస్తవాలు అని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సత్తనపల్లి రైల్వే స్టేషన్ పుటేజ్‌ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సత్తనపల్లిలో బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ఎంత మంది ఉన్నారో తెలుస్తుందన్నారు. ప్రధాని మంత్రి కార్యక్రమానికి సొంత పార్టీ ఎంపీ హాజరైతే సీఎం జగన్‌కు వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. రఘురామకు ఎందుకు అడ్డంకులు సృష్టించారో సమాధానం చెప్పాలన్నారు. 

వైసీపీ ప్రభుత్వంలో అరాచకం పెరిగిపోయిందని అన్నారు. మాచర్లలో తమను హత్య చేయాలని చూశారని అన్నారు. సొంత బాబాయిని హత్య చేయించిన జగన్ రెడ్డికి సొంత పార్టీ ఎంపీ ఒక లెక్కా? ఈ హత్యాప్రయత్నంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.