నెల్లూరు జిల్లా నాయుడుపేటలో టీడీపీ అభ్యర్ధి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించారు ఆ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. నాయుడుపేటలో టీడీపీ అభ్యర్థి దార్ల రాజేంద్ర చొక్కా విప్పించి, కులం పేరుతో దూషించడం అమానుషమని చంద్రబాబు మండిపడ్డారు.

దీనికి పాల్పడిన ఎస్ఐ వెంకటేశ్వర్లుపై తక్షణమే ఎస్ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు చర్య అత్యంత జుగుప్సాకరంగా ఉందంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read:దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, ఎన్నికల నిబంధనలను ఎస్ఐ అతిక్రమించారని టీడీపీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అతడిపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూల్ ఆఫ్ లా పాటించాల్సిన పోలీసులు కొంతమంది వైసీపీకి కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ రెడ్డి విధ్వంస పాలనలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండా పోయిందని.. దళితులు, బడుగు, బలహీనవర్గాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అరాచకాలు సృష్టిస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.