విశాఖలో ప్రఖ్యాత గీతం యూనివర్సిటీలో కూల్చివేతలపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. కట్టడం చేతకాని వాళ్లకు కూల్చే హక్కులేదని అన్నారు.

ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్ష సాధింపు మరో తుగ్లక్‌ చర్య అని ఆయన మండిపడ్డారు. కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా రూ.కోట్ల నష్టాన్ని భరించి 2590 మంది కొవిడ్‌ బాధితులకు గీతం వైద్య సంస్థ చికిత్స అందించిందని చంద్రబాబు గుర్తుచేశారు.

అలాంటి ఆదర్శవంతమైన సరస్వతి నిలయాన్ని అర్ధరాత్రి 200 మందితో వెళ్లి కూల్చడం దారుణమని అన్నారు. ఇప్పటికే చదువు, ఉపాధి, ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మొన్న మాజీ మేయర్‌ సబ్బం హరి ఇంటిపై , నేడు గీతం వర్సిటీలో విధ్వంసం వైసీసీ కక్షసాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆరోపించారు. వ్యక్తులు, పార్టీపై అక్కసుతో వైకాపా పాల్పడుతున్న కక్షసాధింపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఇప్పటికే కొన్ని సంస్థలు ఏపీకి రావాలంటే భయపడే దుస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు.

ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని.. యూనివర్సిటీ ప్రహరీ గోడ(కొంత భాగం), ప్రధాన ద్వారాన్ని అధికారులు కూలగొట్టారు. ఈ క్రమంలో యూనివర్సిటీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.

కూల్చివేత బీచ్ రోడ్డు మీదుగా యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. యూనివర్సిటీ పరిసరాల్లోకి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు.

అయితే నోటీసులు ఇవ్వకుండానే అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదని పేర్కొంది.