మచిలీపట్నం వీవోఏ సంఘం నాయకురాలు నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వైసిపి నేతను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు. 

అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్నం మండల వీవోఏ (VOA)ల సంఘం నాయకురాలు నాగలక్ష్మి(42) ఆత్మహత్య (nagalakshmi suicide)పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (nara chandrababu naidu) స్పందించారు. అధికార వైఎస్సార్ పార్టీ (ysrcp) నాయకుడి వేధింపులకు మహిళ బలవడం దారుణమన్నారు. వైసిపి పాలనలో ఇప్పటివరకు చాలామంది మహిళలు ఇలాగే ప్రాణాలు కోల్పోయారని... అయినా ప్రభుత్వం, పోలీసుల తీసుకున్న చర్యలు శూన్యమని చంద్రబాబు మండిపడ్డారు.

''రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదని మచిలీపట్నంలో నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైంది. మచిలీపట్నంలో VOA (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)గా పనిచేస్తున్న నాగలక్ష్మి తనను అధికార పార్టీకి చెందిన వ్యక్తి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణం'' అంటూ సోషల్ మీడియా వేదికన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

''ఒక మహిళ స్వయంగా స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకోని ఈ వ్యవస్థను ఏమనాలి? ప్రజల ప్రాణాల కంటే, బాధితుల వేదనల కంటే....రాజకీయ ప్రయోజనాలే పోలీసులకు ప్రాధాన్య అంశంగా మారిపోయాయి. నాగలక్ష్మి ఆత్మహత్యకు కారణమైన వారందరినీ శిక్షించాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేసారు.

ఇదిలావుంటే వీఓఏ నాగలక్ష్మిఆత్మహత్యపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. ఇది ఆత్మ‌హ‌త్య కాదని... ముమ్మాటికీ జ‌గ‌న్ రెడ్డి పార్టీ నేత చేసిన హ‌త్య‌గా పేర్కొన్నారు. వీఓఏ నాగలక్ష్మి తాము చెప్పిన‌ట్టు విన‌డంలేద‌ని వైసీపీ నేత నరసింహారావు వెంటాడి వేధించాడని... దీంతో ఆమె పోలీసుకుల కూడా ఫిర్యాదు చేసిందన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకుని వుంటే ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డేది కాదన్నారు. ఎస్పీకి ఫిర్యాదుచేసినా వైసీపీ నేత న‌ర‌సింహారావు నుంచి మ‌హిళని ర‌క్షించ‌లేక‌పోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్య‌వ‌స్థ ఎంత‌గా భ్ర‌ష్టు ప‌ట్టిందో తెలుస్తూనే ఉందని లోకేష్ మండిపడ్డారు.

''ముఖ్య‌మంత్రి గారూ... మీకు ఓట్లేసి గెలిపించింది ప్ర‌జ‌ల‌కి ర‌క్ష‌కులుగా ఉంటార‌ని, ప్ర‌జ‌ల్నే భ‌క్షిస్తార‌ని కాదు. సొంత చెల్లెలిని తెలంగాణ త‌రిమేసి, బాబాయ్ ని చంపేసి ఆయ‌న కుమార్తె ప్రాణాల‌కు ర‌క్ష‌ణ‌లేకుండా చేసిన జ‌గ‌న్‌రెడ్డిని ఆద‌ర్శంగా తీసుకుని గ్రామ‌స్థాయిలో కూడా వైసీపీ నేత‌లు మ‌హిళల‌ ప్రాణాలు తీసేస్తున్నారు. చ‌ట్టాన్ని చుట్టంగా చేసుకున్న వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు పోలీసుల‌కు అండ‌గా వున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లంతా క‌లిసి తిరుగుబాటు చేస్తేనే ప్ర‌జ‌ల ధ‌న‌మాన ప్రాణాల‌కు ర‌క్ష‌ణ దొరుకుతుంది'' అని లోకేష్ పేర్కొన్నారు.

విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ గా పనిచేసే నాగలక్ష్మి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లికి చెందిన నాగలక్ష్మి వీఏఓ (village organising assistant)గా పనిచేసేది. అలాగే మండలంలోని 37 సంఘాలకు బుక్ కీపర్ గా వ్యవహరించేది. అయితే ఆమెను అధికార వైసిపి నాయకుడు నరసింహారావు వేధించేవాడు. ఏ తప్పూ చేయకున్న లంచాలు తీసుకుంటోందని అబద్దాలను ప్రచారం చేయసాగాడు. అంతేకాదు ఆమెపై దుర్భాషలాడుతూ, వెలికి చేష్టలు చేసేవాడు. దీంతో నాగలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. 

ఈ క్రమంలోనే తనను వైసిపి నేత వేధిస్తున్నాడంటూ నాగలక్ష్మి స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసింది. అయితే అతడు అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నరసింహారావు వేధింపులు మరీ మితిమీరిపోయాయి. 

ఈ వేధింపులను ఇక భరించలేకపోయిన నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయిన ఆమెను గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు మెరుగైన చికిత్స అందించినా పలితం లేకుండా పోయింది. పరిస్థితి పూర్తిగా విషమించడంతో నాగలక్ష్మి మృతిచెందింది

పోలీసులు నాగలక్ష్మి పిర్యాదుపై స్పందించి నరసిహారావుపై చర్యలు తీసుకుని వుంటే ఇలా ఆత్మహత్య చేసుకునేది కాదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ ఆత్మహత్య జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. నాగలక్ష్మి మృతదేహాన్ని వీఎఓల సంఘం జిల్లా నాయకురాలు కమల సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.